2023-24రాష్ట్ర బడ్జెట్లో చేనేతరంగానికి రూ. 2వేల కోట్లు కేటాయించాలని ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజినేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనతోపాటు చేనేత సంఘం నాయకులు నాగేంద్ర, శ్రీరాములు, నాగేంద్ర, మారుతి, వెంకటేశులు తదితరులు మంగళవారం ఆర్డీవో కార్యాలయ అధికారిణికి చేనేత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పోలా రామాంజినేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 2లక్షల మంది చేనేత కార్మికులున్నారన్నారు. దీనిపై ఆధారపడి ఉపవృత్తుల వారు మరో2లక్షల మంది ఉన్నారని, అలాంటి చేనేత పరిశ్రమ కేంద్ర బడ్జెట్ కేవలం రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వమైన బడ్జెట్ లో రూ. 2 వేలు కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 11రకాల రిజర్వేషన్ చట్టం ఖచ్చితంగా అమలు జరపాలని డిమాండ్ చేశారు. మార్చి 15వతేదీనుండి 30వ తేదీ వరకు చేనేత కేంద్రాలలో పర్యటించి చేనేత స్థితిగతులను అధ్యయనం చేసి వాటిపై ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు.