సోమవారం రాత్రి ఒంగోలులో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే .. ఢాకా అంజిరెడ్డి(43), పూర్ణిమ(39) భార్యాభర్తలు. స్థానిక విరా ట్ నగర్ ఐదో లైన్‌లో నివాసం ఉంటున్నారు. పూర్ణిమ ఆ ప్రాంతంలోనే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఆర్‌పీగా పనిచేస్తూ ఇంటి వద్ద కిరాణా దుకాణం నడిపేది. కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం రాత్రి అంజిరెడ్డి పూర్ణిమ తలపై చపాతీ చేసే కర్రతో దాడి చేయడంతో బలమైన గాయమై రక్తపు మడుగులో పడిపోయింది. అనంతరం అతను భయంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అదే ఇంట్లో కింద ఫ్లోర్‌లో ఉంటున్న అంజిరెడ్డి తల్లి విజయలక్ష్మీ 12 గంటల సమయంలో ఇంటి ముందు కుమారుడి బైక్ లేకపోవడంతో పైకి వెళ్లి చూసింది. కోడలు రక్తపుమడుగులో పడి ఉండటం చూసి వెంటనే తన భర్త సుబ్బారెడ్డికి విషయం తెలిపింది. ఈ మేరకు ఆమెను రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అదేక్రమంలో మంగళవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకు రావడంతో వాట్సాప్ గ్రూపులలో చూసి అది అంజిరెడ్డిదని బంధువులు గుర్తించారు. కాగా భార్యను చపాతీ కర్రతో కొట్టడంతో ఆమె రక్తపుమడుగులో పడిపోవడం చూసిన అంజిరెడ్డి భయంతో వెంటనే తన బైక్‌పై అర్ధరాత్రి కొత్తపట్నం వెళ్లి సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.