కృష్ణానదిలో ఇసుకను అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారని విపక్ష నేత.. కాదు.. కాదు.. మీ హయాంలోనే అక్రమాలు జరిగాయని అధికార పక్ష నేత మధ్య రాజుకున్న వివాదం.. అమరావతిలో సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు దారి తీసింది. ఈ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్యెల్యే కొమ్మాలపాటి శ్రీధర్.. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అక్రమాలను నిరూపిస్తానని సవాల్ రువ్వారు. దీనికి ప్రతిగా.. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలను నిరూపిస్తానని నంబూరు శంకరరావు ప్రతి సవాల్ విసిరారు. ఇరువురూ అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణాలకు సిద్ధమయ్యారు. ఈ పరిణామం ఆదివారం అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం రాత్రి నుంచే అప్రమత్తమైన పోలీసులు.. టీడీపీ నేతలకు నోటీసులు జారీచేసి.. ఇంటి నుంచి బయటకు కదలడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. కొందరిని గృహ నిర్బంధం చేశారు. అదే సమయంలో అమరావతిలో సెక్షన్ 144 విధించారు. అయితే, వైసీపీ నేతలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను మాత్రమే నిర్బంధించడం ఏంటని ప్రశ్నించిన టీడీపీ నేతలు.. కొమ్మాలపాటి వెంట కలిసి వచ్చారు.