గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలిప్పిస్తామని రూ.30లక్షల వరకు దోచేసిన ముగ్గురిని క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు స్థానిక క్రైమ్ పోలీసు స్టేషన్‌లో నిందితుల వివరాలను ఎస్‌ఐ ఉమా మహేశ్వర్‌రావుతో కలిసి సీఐ భాస్కర్ మీడియాకు తెలియజేశారు. సచివాలయ ఉద్యోగమిప్పిస్తామని చెప్పి తన వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారని చిత్తూరు నగరంలోని మిట్టూరుకు చెందిన లక్ష్మి అనే యువతి క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన క్రైమ్ పోలీసులు నిందితులను పట్టుకోవడానికి సాంకేతికతను వివియోగించారు. శుక్రవారం అందిన రహస్య సమాచారంతో ఏలూరు జిల్లా శాంతినగర్‌కు చెందిన బత్తుల శ్రీనివాసులు(48), బత్తుల జయకృష్ణ ప్రియ(40), గుడిపాలకు చెందిన దశరథ(49)లను చిత్తూరు ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 2019 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలామంది నుంచి వీరు రూ.30 లక్షల వరకు కాజేసినట్లు గుర్తించారు. నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేశాక, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్యోగాలిప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని సీఐ సూచించారు. అలాంటి వారెవరైనా తారసపడితే సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.