హిందూజా కంపెనీకి ప్రజాధనాన్ని దోచిపెట్టవద్దని సీపీఎం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. విద్యుత్తు పంపిణీ సంస్థల ద్వారా ఇప్పటికే రూ.800 కోట్లు పొందిన హిందూజా కంపెనీ తాజాగా మరో రూ.1,600 కోట్లు చెల్లించాలని కోరినట్లు వార్తలొచ్చాయని, ఆ ప్రతిపాదనను తిరస్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఏపీఈఆర్‌సీని కోరారు. ఉత్పత్తి చేసిన విద్యుత్తుకే రూ.4.88 పైసలు చెల్లించాలని, ఇంకేమీ అవసరం లేదని విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ ఇప్పటికే తీర్పు ఇచ్చిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే విద్యుత్తు చార్జీలు, ట్రూ అప్ చార్జీలు పెరిగిపోగా... హిందూజా పేరుతో మళ్లీ వడ్డనకు సిద్ధమైన ప్రభుత్వాన్ని తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.