ఇటీవల నిర్వహించిన డీఎస్సీ–1998 కాంట్రాక్టు ఎస్జీటీ ఉపాధ్యాయ ఉద్యోగ నియమాకాల్లో భర్తీకాకుండా మిగిలిపోయిన 13 పోస్టులను మెరిట్ జాబితాలో తదుపరి మెరిట్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌లను కేటాయించాలని ఏలూరు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో డీఎస్సీ–98లో మొత్తం 274 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 261 మంది మాత్రమే హాజర య్యారు. మిగిలిన 13 పోస్టులను భర్తీ చేయడానికి తదుపరి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. మరోవైపు కౌన్సెలింగ్‌కు హాజరై నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికీ విధుల్లో చేరలేదు. ఈ ముగ్గురు పలు కారణాల వల్ల ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా నియామకాలు జరగనున్న 13 పోస్టులతో పాటు ఈ మూడింటిని కలిపి కౌన్సెలింగ్ నిర్వహించే విషయమై విద్యాశాఖ ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపేందుకు సిద్ధమైంది. ఈ నెల 27లోగా మిగిలిపోయిన పోస్టులన్నింటిని భర్తీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ ప్రయత్నిస్తోంది.