వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. బైక్, ఇద్దరు అమ్మాయిలను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఒళ్లు గగొర్పుడిచే ఈ ఘటన కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డుకాగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జులై 18న రాయ్‌చూర్‌లోని రాఘవేంద్ర పెట్రోల్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉండే రోడ్డులో ఎదురుగా వస్తున్న వాహనాలను పట్టించుకోకుండా.. ఓ బైకర్ హఠాత్తుగా యూ-టర్న్ తీసుకోవడం ప్రమాదానికి దారితీసింది.
అతడు యూటర్న్ తీసుకుని అవతలివైపునకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు బైకర్‌ను ఢీకొట్టి ముందుకెళ్లింది. దీంతో అతడు అమాంతం గాల్లో ఎగిరిపడ్డాడు. బైకర్‌ను తప్పించే క్రమంలో రోడ్డు పక్కన నడిచి వెళ్తోన్న ఇద్దరు బాలికలను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి బాలికలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బైకర్‌కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడ్ని అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ దృశ్యాలు అక్కడనున్న సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబందనలు పాటించాలని, లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఈ ప్రమాదంపై కర్ణాటక ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ విభాగం డీజీపీ స్పందించారు. బైకర్, కారు డ్రైవర్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలకు ఆయన ఆదేశించారు. అంతేకాదు, ఇద్దరి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులకు సూచించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు స్కూల్ విద్యార్ధినులు గాయపడటం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ మేరుకు ఆయన ట్వీట్ చేశారు. డీజీపీ ఆదేశాలతో రాయచూర్ ట్రాఫిక్ పోలీసులు బైకర్, కారు డ్రైవర్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.