ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన పథకం నిధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చిత్తూరు జిల్లా నగరిలో బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. అదే విధంగా నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైయస్ జగన్ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చుచేసింది.