ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్‌లో ఆగని హింస.. రంగంలోకి దిగిన సర్జికల్ స్ట్రైక్స్ హీరో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 03, 2023, 08:16 PM

జాతుల మధ్య హింసతో 4 నెలలుగా అట్టుడికి పోతోన్న మణిపూర్‌లో ఇప్పటికీ శాంతి నెలకొనడం లేదు. ఇటీవల అక్కడ కొంత శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. వారం క్రితం ఆగస్టు 29 న మరోసారి ఇంఫాల్‌లో హింసాకాండ చెలరేగింది. ఇందులో 8 మంది మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో ఇంఫాల్‌లో మిగిలి ఉన్న కుకీ కుటుంబాలను భద్రతా దళాలు బలవంతంగా కొండ ప్రాంతాలకు తరలించాయి. మరోవైపు.. మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కీలక అధికారిని నియమించింది. 2015 లో మయన్మార్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్‌బామ్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.


మణిపూర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ సూపరింటెండెంట్‌గా కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌ను అక్కడి ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు సీనియర్ సూపరింటెండెంట్ పదవిలో నెక్టార్ సంజెన్‌బామ్‌ పనిచేస్తారని స్పష్టం చేస్తూ.. ఆగష్టు 24 న ఉత్తర్వులు వెలువరించింది. దేశ అత్యున్నత పురస్కారాలైన కీర్తి చక్ర, శౌర్య చక్రలను కల్నల్ నెక్టార్‌ సంజెన్‌బామ్‌ దక్కించుకున్నారు. తన సాహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితులనైనా చక్కదిద్దే వ్యూహాలను రచించడంలో నెక్టార్ సంజెన్‌బామ్ దిట్ట అని పేరు ఉంది. మరోవైపు.. మెయితీలు అధికంగా నివసించే పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాలోని లంబులానే ప్రాంతం నుంచి.. కుకీ తెగలకు చెందిన వారిని అధికారులు, సాయుధ బలగాలు బలవంతంగా కొండ ప్రాంతాల్లోకి తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇళ్లలోకి వచ్చి నిద్రలో ఉన్నవారిని లేపి.. ఎటు తీసుకెళ్తున్నారో చెప్పకుండా తరలించారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమ వస్తువులను కూడా తీసుకువెళ్లే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. బులెట్ ప్రూఫ్ వాహనాల్లోకి ఎక్కించి కుకీలు ఎక్కువగా ఉండే కంగ్‌పోక్పి జిల్లాలోని మోట్‌బంగ్ ప్రాంతానికి పంపించినట్లు తెలిపారు. భద్రత కల్పించాల్సింది పోయి.. అమాయకులైన తమను వేరే ప్రాంతానికి కేంద్ర భద్రతా దళాలు తరలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


మొత్తం 10 కుటుంబాలకు చెందిన 24 మందిని అక్కడి నుంచి తరలించనట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఆగస్టు 27న లంబులానే ప్రాంతంలో అల్లర్లకు తెగబడ్డ మూకలు.. 3 ఇళ్లను దహనం చేశారని.. మరిన్ని దాడులు జరగక ముందే మిగిలిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు చెప్పాయి. మణిపూర్‌లో మెజారిటీలుగా ఉన్న మెయితీలకు గిరిజన హోదా కల్పించే అంశాన్ని పరిశీలించాలని.. ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు సూచించడంతో అసలు సమస్య మొదలైంది. దీంతో మే 3న మణిపూర్‌లో అల్లర్లు చోటు చేసుకోగా.. ఇప్పటివరకు 200 మందికిపైగా చనిపోయారు. సుమారు 50 వేల మంది తమ ఇళ్లను విడిచి ప్రభుత్వ శిబిరాలకు తరలివెళ్లిపోయారు. అయితే ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అందులో ఒకరిపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన వీడియో వైరల్‌ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa