స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు చంద్రబోస్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. 2016 లో చేరి బెంగాల్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో చంద్రబోస్ పోటీ చేశారు. రాజీనామా సందర్భంగా పార్టీపై చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాను చేరిన లక్ష్యం నెరవేరలేదని.. అందుకు పార్టీ సహకరించలేదని తీవ్ర స్థాయిలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను పార్టీలో చేరానని.. అయితే తనకు అలాంటి సహకారం అందలేదని ఆరోపించారు. జాతీయవాద నేత అయిన నేతాజీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో బీజేపీ తనకు సహకరించలేదని రాజీనామా లేఖలో చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. 2016 లో పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన చంద్రబోస్‌ను 2020 లో చేపట్టిన పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఆయన సోదరుడు శరత్ చంద్రబోస్‌ల భావజలాన్ని ప్రజల్లోకి తీసుకుకెళ్లేందుకు తాను అప్పట్లో బీజేపీతో చర్చలు జరిపినట్లు చంద్రబోస్ వెల్లడించారు. బీజేపీ వేదికగా దేశవ్యాప్తంగా సుభాష్ చంద్రబోస్ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు తనకు అనుమతి ఇచ్చారని భావించానని తెలిపారు. బీజేపీ ఫ్రేమ్‌వర్క్‌లోనే నేతాజీ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఆజాద్ హింద్ మోర్చా ఏర్పాటు చేసేందుకు నిర్ణయం కూడా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఆజాద్ హింద్ మోర్చా ద్వారా కులం, మతం, జాతికి అతీతంగా భారతీయులు అందరినీ ఏకం చేయాలనేది తన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన రాజీనామా లేఖలో చంద్రబోస్ వివరించారు.
భారత దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఈ భావజాలం చాలా ముఖ్యమని చంద్రబోస్ అభిప్రాయపడ్డారు. తాను నిర్దేశించుకున్న ఆ లక్ష్యాలను చేరుకునేందుకు తాను చేపట్టిన కార్యక్రమాల్లో బీజేపీ నుంచి ఎలాంటి సపోర్ట్ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీజేపీ నుంచి గానీ బెంగాల్ బీజేపీ శాఖ నుంచి గానీ ఎలాంటి సాయం లభించ లేదని తెలిపారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు తాను సమగ్ర బెంగాల్ స్ట్రాటజీని బీజేపీ ముందు ఉంచానని.. అయినప్పటికీ తన ప్రతిపాదనలను పార్టీ విస్మరించిందని ఆరోపించారు. అయితే చంద్రబోస్ రాజీనామాపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి సామిక్ భట్టాచార్య స్పందించారు. చాలా కాలం నుంచి చంద్రబోస్ పార్టీలో యాక్టివ్‌గా లేరని వివరించారు.