శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు గ్రామంలో జరిగిన అన్యాయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే....వజ్రపుకొత్తూరు గ్రామానికి చెందిన వళిశెట్టి రాజేష్ ఇచ్ఛాపురం ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అక్కడ ఓ ఉపాధ్యాయురాలిని 2021 నవంబరు 19న రిజిస్టర్ వివాహం చేసుకున్నాడు. ఈ విషయం గ్రామస్థులకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ తెలియదు. రహస్యంగా ఆమెతో కాపురం చేస్తున్నాడు. పనిదినాల్లో ఇచ్ఛాపురంలో ఉంటూ సెలవులకు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో తన గ్రామానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. అందుకు కులపెద్దల సమక్షంలో రూ.8 లక్షల కట్నం, 5 తులాల బంగారం, ఓ ద్విచక్ర వాహనం కావాలని డిమాండ్ చేయగా అందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించారు. రాజేష్ రూ.2 లక్షల కట్నం అడ్వాన్స్‌గా తీసుకుని 2022 జూన్‌లో పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. వైజాగ్‌లో ఉద్యోగం చేస్తున్న ఆ యువతి వద్దకు వెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి గ్రామంలోని అమ్మాయి ఇంటికి వెళ్లి అల్లుడి లాంచనాలు తీసుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి ముహుర్తం ఎప్పుడు పెట్టుకుంటామని అమ్మాయి తల్లి ప్రశ్నించగా అప్పటి నుంచి కుంటిసాకులు చెబుతూ వాయిదా వేస్తున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గ్రామపెద్దలను ఆశ్రయించారు. పెద్దలు పలుదపాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడినా అతను పెళ్లికి అంగీకరించలేదు. దీంతో బుధవారం ఆ యువతి వజ్రపుకొత్తూరు పోలీసులకు పిర్యాదు చేసింది. సీఐ జి.శంకరరావు, ఎస్.మధుసూదన్ ఇచ్ఛాపురం వెళ్లి విచారించగా రాజేష్ మొదటి పెళ్లి వ్యవహారం బయటపడింది. ఈ మేరకు అతనిపై 417, 420, 376 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. పలాస కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.