మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపుగా దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. ఈ తుఫాన్‌కు మిచౌంగ్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతానికి చెన్నైకి 310కి.మీ, నెల్లూరుకు 440కి.మీ, బాపట్లకు 550 కి.మీ,మచిలీపట్నానికి 550 కి.మీ.దూరంలో ఉంది. ఆ తర్వాత దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. మత్స్యకారులు వరకు వేటకు వెళ్ళరాదని.. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
‘మిచౌంగ్’ తుఫాన్ ప్రభావం నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ రెండు జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజుల (సోమవారం, మంగళవారం) పాటూ సెలవులు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, జరుగుమల్లి, టంగుటూరు, సింగరాయకొండలో ముందస్తుగా సహాయక చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. నెల్లూరు జిల్లాలో తీరప్రాంతాలైన కావలి, అల్లూరు, దగదర్తి, విడవలూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరుల్లో ముందస్తు సహాయక ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. రెండు జిల్లాల్లో ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు మండలానికో ప్రత్యేక అధికారిని నియమించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సహాయక చర్యలు చేపట్టేలా కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బందికి సూచనలిచ్చారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారం తీసుకునేందుకు వివరాలు సేకరించారు.
తీరప్రాంత గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. అందుబాటులో ఉన్న పునరావాస కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. బియ్యం, కందిపప్పు ఆయా ప్రాంతాల్లోని చౌకధరల దుకాణాల వద్ద సిద్ధం చేశారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడంతో పాటు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. పెనుగాలుల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా విద్యుత్తు శాఖ చర్యలు చేపట్టింది. తుఫాన్ హెచ్చరికలతో అధికారులంతా సన్నద్ధంగా ఉండాలన్నారు సీఎం జగన్. ఈ మేరకు తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదన్నారు. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలని.. ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు ఎనిమిది జిల్లాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తిరుపతి జిల్లాకు రూ. 2 కోట్లు, నెల్లూరు, ప్రకాశం. బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ. 1 కోటి చొప్పున నిధులు విడుదల చేశారు.