ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గిన ఆర్థిక బలం.. మారిన చైనా స్వరం.. అమెరికాతో దోస్తీకి డ్రాగన్ ఆరాటం

international |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 11:02 PM

గత కొన్నేళ్లుగా అమెరికా, చైనా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలిసిందే. చైనా మీడియా అయితే అమెరికాను ఓ శత్రుదేశంలా చూసేది. అమెరికా తమ దేశాన్ని కట్టడి చేయడానికి, ప్రపంచ వేదికగా మీద బలహీనం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా మీడియా అభిప్రాయపడేది. తైవాన్‌కు అమెరికా మద్దతునివ్వడం, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయె‌ల్‌కు సపోర్ట్ చేయడం లాంటి అంశాల పట్ల చైనా మీడియా ఆక్రోశం వెల్లగక్కేది. అయితే ఇటీవలి కాలంలో చైనా స్వరంలో మార్పు కనిపిస్తోంది. అమెరికాతో స్నేహ సంబంధాల కోసం ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే చైనా మీడియా వైఖరి సైతం మారింది.


చైనా అధినేత జిన్‌పింగ్ ఇటీవల మాట్లాడుతూ.. తాము ఎవరితోనూ కోల్డ్ వార్ లేదా హాట్ వార్ (మాటల యుద్ధం లేదా అసలైన యుద్ధం) కోరుకోవడం లేదన్నారు. కొంత కాలంగా చైనా, అమెరికా స్నేహ సంబంధాల గురించి చైనా మీడియాలో కథనాలు రావడం మొదలయ్యాయి. ఆ దేశ మీడియాలో వచ్చిన ఈ మార్పు ఆసక్తికరంగా మారింది. నవంబర్ 15న అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశం అయ్యారు. ఈ భేటీకి కొద్ది వారాల ముందు నుంచి అమెరికా పట్ల చైనా మీడియా వైఖరిలో మార్పు మొదలైంది.


‘ఫ్లయింగ్ టైగర్స్’ అని పిలిచే అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా చైనా మిలటరీతో కలిసి పోరాడింది. ఆ గ్రూప్‌కు చెందిన ఓ సైనికుడికి చైనా అధినేత జిన్‌పింగ్ లేఖ రాశారని చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ జిన్హువా తెలిపింది. ఆ లేఖలో అమెరికా, చైనా మధ్య సంబంధాలను ప్రస్తావించిన జిన్‌పింగ్.. ఇరు దేశాల మధ్య లోతైన స్నేహసంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ స్నేహ బంధం కాలపరీక్షకు నిలిచిందన్నారు.


ఈ ఏడాది ఆరంభంలో అమెరికాను యుద్ధకాంక్ష గల దేశంగా అభివర్ణించిన చైనా పత్రిక.. ఆ తర్వాత బైడెన్-జిన్‌పింగ్ భేటీ వేళ ఫ్లయింగ్ టైగర్స్‌ను ప్రశంసిస్తూ కథనాలు గుప్పించింది. గాజాలో అమాయక పౌరుల రక్తపు మరకలు అమెరికాకు అంటుకున్నాయని ఆరోపించిన గ్లోబల్ టైమ్స్ పత్రిక.. బైడెన్‌ను జిన్‌పింగ్ కలిసిన టైంలో మాత్రం ఇరు దేశాల మధ్య సహకారానికి పిలుపునిచ్చింది. చైనా విశ్లేషకులు వైఖరిలో సైతం ఇదే తరహా మార్పు వచ్చింది.


జిన్‌పింగ్ నేతృత్వంలో పని చేసే కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశాల మేరకే చైనా మీడియా వైఖరి మారిందని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో స్కాలర్‌గా వ్యవహరిస్తోన్న ఆల్ఫర్డ్ వు అభిప్రాయపడ్డారు. చైనా మీడియా వైఖరి కచ్చితంగా ఆ దేశ ప్రభుత్వ వైఖరికి తగ్గట్టుగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛలో ఉత్తర కొరియా అట్టడుగు స్థానంలో ఉండగా.. చైనా దాని కంటే ఒకడుగు మాత్రమే వెనుక ఉంది. చైనా మీడియా మార్కెట్లో మనగలగాలంటే.. కచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా పని చేయాల్సిందే. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అమెరికా, చైనా మధ్య సంబంధాల విషయంలో సానుకూల ధోరణితో ఉంది కాబట్టి చైనా మీడియా సైతం అదే ధోరణితో కథనాలు ప్రసారం చేస్తోంది.


మరి చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీ వైఖరిలో ఇంత మార్పు రావడానికి, అమెరికాకు స్నేహహస్తం చాపడానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు. చైనా వృద్ధి రేటు మందగిస్తోంది. అంచనాల కంటే తక్కువగా వృద్ధి కనిపిస్తోంది. ఆ దేశంలో నిరుద్యోగం జూన్‌లో 21.3 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత చైనా నిరుద్యోగానికి సంబంధించిన వివరాలు వెల్లడించడం మానేసింది. చైనాలో తొలిసారిగా.. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష్య పెట్టుబడుల లోటు నమోదైంది. మరోవైపు కంపెనీలు చైనా వెలుపలికి తరలడం ఊపందుకుంది.


ఈ కారణాలతోనే చైనా వైఖరిలో మార్పు కనిపిస్తోంది. మీతో మేం సత్సంబంధాలు కోరుకుంటున్నాం. మనం కలిసి మాట్లాడుకుందాం.. అనే సంకేతాలను అమెరికాతోపాటు పశ్చిమ దేశాలకు డ్రాగన్ పంపిస్తోంది. విదేశీ పెట్టుబడులు లేకపోతే చైనా బండి నడవడం కష్టం. అందుకే ఎఫ్‌డీఐల కోసం ఏం చేయడానికైనా సిద్ధం అనేది చైనా వైఖరిగా కనిపిస్తోంది. అయితే చైనా మీడియాలో ఎక్కడా ఆ దేశ ఆర్థిక పరిస్థితి క్షీణతకు సంబంధించిన కథనాలు రావడం లేదు. అమెరికాతో దోస్తీ గురించి మాత్రమే కథనాలు వస్తున్నాయి. జిన్‌పింగ్, బైడెన్ భేటీ ముగిసిన రెండు వారాల తర్వాత కూడా చైనా మీడియా ఇదే వైఖరిని కనబరుస్తోంది.


అయితే ఈ వైఖరి ఎంతో కాలం కొనసాగే అవకాశం లేదు. చైనా మీడియా మళ్లీ తన వైఖరిని మార్చుకునే అవకాశం ఉంది. అమెరికా, చైనా మధ్య విబేధాలకు కారణాలు బోలెడు. విదేశాంగ విధానం విషయానికే వస్తే.. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ లాంటి విషయాల్లో ఇరు దేశాల వైఖరి పూర్తిగా భిన్నం. ఒక్కసారి తైవాన్ గురించి అమెరికా నేతలెవరైనా సరే సానుకూలంగా మాట్లాడితే చాలు.. చైనా వైఖరిలో, చైనా మీడియా వైఖరిలో మార్పును మనం గమనించొచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com