నాలుగు నెలల బాలుడు చేప పిల్లను మింగేశాడు. గొంతులో బతికున్న చేప అడ్డం పడి, శ్వాస తీసుకోవడానికి పసికందు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఊపిరాడక విలవిల్లాడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకురాగా.. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వైద్యులు తీవ్రంగా శ్రమించి బాలుడి ప్రాణాలు కాపాడారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదోనిలోని దేవి చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యుడు హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. కౌడల్‌పేటకు చెందిన బందే నవాజ్, మోహమ్మది దంపతులకు 4 నెలల కుమారుడు ఉన్నారు.
తల్లిదండ్రులు బాలుడి పెదాలకు బతికున్న చేపను తాకించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చేప చేతిలో నుంచి జారిపోయి, బాలుడి నోట్లో పడిపోవడం, గొంతులోకి జారిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. గొంతుకు అడ్డంగా చేప ఇరుక్కుపోయింది. శ్వాస తీసుకునేందుకు వీల్లేకుండాపోయింది. బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయాన్ని గమనించిన డాక్టర్ హరీష్ ఇతర వైద్యుల సాయంతో వెంటనే అతడికి కృత్రిమంగా శ్వాస అందించే ప్రయత్నం చేశారు. ఊపిరితిత్తులకు వరకు పైపును పంపి ఆక్సిజన్ అందించారు. దీంతో బాలుడు కాస్త కుదుటపడ్డాడు. ఆ తర్వాత అనస్తీషియా, ఈ అండ్ టీ వైద్యులు కలిసి బాలుడి గొంతులో ఇరుక్కు్న్న చేపను అతికష్టం మీద బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడని డాక్టర్ హరీష్ తెలిపారు.
అసలు ఎలా జరిగింది?
పిల్లాడి పెదవులకు బతికున్న చేపను తాకిస్తే ఆరోగ్యంగా ఉంటారని అక్కడి వారి నమ్మకమట. ఈ క్రమంలో సంప్రదాయంలో భాగంగా 4 నెలల బాలుడి పెదాలకు అతడి తల్లిదండ్రులు బతికున్న చేపపిల్లను తాకించే ప్రయత్నం చేశారు. చేతిలో ఉన్న చేప జారి పిల్లాడి నోట్లోకి వెళ్లిపోయింది. ప్రాణాంతకంగా పరిణమించింది. ఇలాంటి విశ్వాసాలు నమ్మి, ప్రయోగాలు చేయొద్దని డాక్టర్ హరీష్ తెలిపారు. చేపలకు సహజంగానే జారే స్వభావం ఉంటుందని, బతికున్న చేప పిల్ల కావడం వల్ల.. చేతుల్లో కొట్టుకోవడంతో ఒక్కసారిగా జారి, నోట్లో పడి ఉంటుందని ఆయన వివరించారు.