పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తారాపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ పులి పిల్ల మృతి చెందింది. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన పులి పిల్ల వయస్సు 2 సంత్సరాలు ఉంటుందని అంచనా అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ పులిని గుర్తించలేదని అటవీ అధికారులు చెప్పారు. తాజాగా పులి పిల్ల మృతితో పులి ఉనికి బయటపడిందని చెప్పారు. ఈ ప్రాంతంలో చాలా కాలం క్రితం రాయల్ బెంగాల్ టైగర్ ఆడ పులి సంచారం ఉందని చెప్పారు. ఇప్పుడు మృతి చెందింది దాని సంతతి అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే పొరుగునున్న ఒడిశా నుండి అయినా వచ్చి ఉండవచ్చుని చెబుతున్నారు. ఈ కోణంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పులి పిల్ల మృతితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ మరిన్ని పులులు ఉండే అవకాశం ఉందని అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.