ముంబయిలో న్యూఇయర్ ముంగిట భారీ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో థానేలో 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశారు. థానే క్రైమ్ బ్రాంచ్ యూనిట్ చేపట్టిన లేట్ నైట్ ఆపరేషన్‌లో రేవ్ పార్టీ బాగోతం బట్టబయలైంది. థానేలోని కాసర్‌వాడవ్లీ క్రీక్‌సైడ్‌లో రేవ్ పార్టీని ఛేదించినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. పార్టీ గురించి ఇన్‌ఫార్మర్ల ద్వారా థానే పోలీసులకు సమాచారం అందిందని, ఆ తర్వాత నిఘా ఉంచి దాడి చేశారని మీడియాకు సీఎం తెలిపారు. ‘మా ప్రభుత్వం ఇటువంటి కార్యకలాపాలపై నిరంతర చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న యూనిట్లన్నింటినీ కూల్చివేసి, అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించాను’ అని ఆయన ఉద్ఘాటించారు.
ముంబయి, నవీ ముంబయి, థానే, మీరా-భయేందర్‌తో మెట్రోపాలిటన్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులను సోషల్ మీడియా, ఆన్‌లైన్‌లో నిందితులు రేవ్ పార్టీకి ఆహ్వానించినట్టు థానే డిప్యూటీ కమీషనర్ (క్రైమ్) శివరాజ్ పాటిల్ చెప్పారు. ‘న్యూ ఇయర్ ఈవ్ రేవ్ పార్టీలపై నిఘా ఉంచాలని పోలీసు కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు.. ఆ తర్వాత విశ్వసనీయ మూలం ద్వారా మాకు సమాచారం అందింది.. కాసర్‌వాడవ్లీ ప్రాంతంలోని క్రీక్‌సైడ్ రేవ్ పార్టీపై మేము దాడి చేశాం.. చట్టవిరుద్ధంగా నిర్వహించిన పార్టీలో డ్రగ్స్, మత్తు పదార్థాలు సేవించిన ఐదుగురు మహిళలతో సహా 95 మందిని అదుపులోకి తీసుకున్నాం’ అని డీసీపీ వెల్లడించారు. ఘటనా స్ధలంలో ఎల్ఎస్‌డీ, మారిజువాన, చరస్‌లు, ఎక్స్‌టాసీ టాబ్లెట్స్ సహా సహా రూ. ఎనిమిది లక్షల విలువైన డ్రగ్స్2ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని థానే క్రైమ్ బ్రాంచ్ యూనిట్-5 సీనియర్ ఇన్‌స్పెక్టర్ వికాస్ ఘోడ్కే తెలిపారు. అదుపులోకి తీసుకున్నవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక న్యూ ఇయర్ పార్టీని భారీ స్ధాయిలో నిర్వహిస్తూ యువత డ్రగ్స్ వాడుతున్న తీరు ఈ ప్రాంతంలో కలకలం రేపింది.