ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. మరికొన్ని రోజుల్లో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ ఎయిర్‌పోర్టు ద్వారా దేశ, విదేశాల నుంచి భక్తులు రాముడిని దర్శించుకునేందుకు రానున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య విమానాశ్రయాన్ని రికార్డ్ సమయంలో వేగంగా నిర్మించారు. దీంతోపాటు ఎన్నో విశిష్ఠతలు, ప్రత్యేకతలు ఈ ఎయిర్‌పోర్ట్‌కు ఉన్నాయి. ఈ అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మీకీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని నామకరణం చేశారు.
అయోధ్యలోని మహర్షి వాల్మీకీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును రికార్డు సమయంలో కేవలం 20 నెలల్లోనే పూర్తి చేసినట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా - ఏఏఐ ఛైర్మన్ సంజీవ్ కుమార్ తాజాగా తెలిపారు. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వచ్చే పర్యాటకులతోపాటు స్థానిక వ్యాపారాలకు కూడా ఈ ఎయిర్‌పోర్ట్ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ఎయిర్‌పోర్ట్‌ను మరింత విస్తరిస్తామని సంజీవ్ కుమార్ చెప్పారు.
గతంలో 178 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను.. రూ.350 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా ఏఏఐ డెవలప్ చేసింది. ఈ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ 821 ఎకరాల స్థలాన్ని అందించింది. 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయోధ్య ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. రద్దీ సమయాల్లో గరిష్ఠంగా 600 మంది ప్రయాణికులకు, ఏటా 10 లక్షల మందికి సేవలు అందించడానికి వీలుగా ఎయిర్‌పోర్టులో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
ఈ ఎయిర్‌పోర్టు రన్‌వే పొడవు 2.2 కిలో మీటర్లు కాగా.. పెద్ద విమానాలైన ఎయిర్‌బస్-321 విమానాల రాకపోకలకు కూడా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. 2 లింక్ ‘టాక్సీవే’లతోపాటు 8 విమానాలను పార్కింగ్ చేయడానికి అనువుగా విశాల స్థలం ఉంది. ఇక అయోధ్య చరిత్ర, విశిష్టతను దృష్టిలో ఉంచుకుని.. ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఎయిర్‌పోర్ట్ పనులను చేపట్టారు. శ్రీరామ మందిర స్ఫూర్తితో అదే ఆకారంలో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే కళాఖండాలు, పెయింటింగ్‌లు, కుడ్యచిత్రాలతో అలంకరించారు.
ఇక ఈ విమానాశ్రయంలో 9 చెక్-ఇన్ కౌంటర్లు, 3 కన్వేయర్ బెల్ట్‌లు, 5 లగేజీ స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. కారు, బస్సు పార్కింగ్‌తోపాటు వికలాంగులకు అనుకూలమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎయిర్‌పోర్టులో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, ఎల్‌ఈడీ లైటింగ్, వర్షపు నీటి నిర్వహణ, 250 కేడబ్ల్యూపీ సామర్థ్యంతో కూడిన సౌర విద్యుత్ ప్లాంట్, తాగునీరు, మురుగు శుద్ధి ప్లాంట్ వంటివి ఏర్పాటు చేశారు. ఫౌంటెయిన్‌లతో కూడిన పచ్చదనం నిర్వహణకు రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగిస్తున్నారు. ఫేజ్-2లో భాగంగా 50 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్‌ను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. రద్దీ సమయాల్లో దాదాపు 4 వేల మందికి, ఏటా 60 లక్షల మందికి సేవలు అందించేలా నిర్మించనున్నారు. ప్రస్తుతం 2.2 కిలోమీటర్లుగా ఉన్న రన్‌వేను 3.75 కిలో మీటర్లకు పొడిగించాలని.. మరో ట్యాక్సీ వే, అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కల్పించనున్నారు.