వేలాది సంవత్సరాల క్రితం ఎలాంటి శ్రమ లేకుండా కూర్చొని తినడానికి, శ్రమజీవుల మీద ఆధిపత్యం చేయడాని కోసం కులాలను, పుక్కిటి పురాణాలను పుట్టించి కర్మ, ధర్మ సిద్దాంతాలతో రాజ్యమేలుతున్న బ్రాహ్మణీయ అగ్రకుల శక్తుల ఆటకట్టించేందుకై ఎన్నో ఉధ్యమాలను నిర్మించిన పెరియార్ 1879 సెప్టంబరు 17వ తేదీన తమిళనాడులోని ఈరోడు పట్టణంలో జన్మించారు. ఈయన తండ్రి వెంకటప్పనాయకర్, తల్లి చిన్నతాయమ్మాళ్.పెరియార్ అసలు పేరు ఇ.వి.రామస్వామి. పెరియార్ అంటే తమిళంలో రుషి, జ్ఞాని అని అర్థం. పెరియార్ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగారు. పాతికేళ్ల ప్రాయంలోనే తన తండ్రికి తెలియకుండా అప్పుచేసి భూమి కొనుగోలు చేశాడని పెరియార్ ను తండ్రి మందలించడంతో బాధపడి కుటుంబం వదిలి సన్యాసిగా మారిపోయారు. అయితే ఆయన దేశంలోని ప్రధాన నగరాలన్నీ తిరిగి లోకజ్ఞానం సంపాదించారు. తర్వాత కాశీ లో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఆకలితో దిక్కుతోచక బికారిగా తిరుగుతున్న పెరియార్ ఆచూకీని తండ్రి కనుగొని స్వయంగా ఇంటికి తీసుకెళ్లి వ్యాపార బాధ్యతలను అప్పగించారు. ముప్పై ఏళ్ల ప్రాయంలోనే కాంగ్రేస్ పార్టీ పట్ల ఆసక్తి చూపసాగారు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే భర్త చనిపోయి వితంతువుగా ఉన్న తన అక్క కూతురికి కుటుంబంలో అందరూ వ్యతిరేకిస్తున్నా రహస్యంగా పెళ్లి జరిపించారు. 1911లో పెరియార్ తండ్రి మరణించారు. పెరియార్ స్వయంకృషి , నీతి నిజాయితి, సేవాభావం మూలంగా ప్రజల చేత నీరాజనాలందుకొని ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే 1917 లో ఈరోడు నగరపాలక సంస్థకు చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1919లో కాంగ్రేస్ పార్టీలో చేరే నాటికే జిల్లాలోని 29 గౌరవ పదవులు పొందాడంటే ఆయనపట్ల ప్రజల అభిమానం ఎంతటిదో ఊహించవచ్చు. పెరియార్ నాయకత్వం లేనిదే కాంగ్రేస్ పార్టీ మనుగడ లేదన్న వాతావరణం ఏర్పడిపోయింది. పార్టీ నాయకత్వమంతా బ్రాహ్మణుల చెప్పుచేతల్లో ఉందని వారిలో ఏ ఒక్కరూ మినహాయింపు లేకుండా నీఛ, నికృష్ట వర్ణాశ్రమ వ్యవస్థను బలంగా స్థిరపరచాలన్న కుటిల లక్ష్యం కలవారని పెరియార్ తెలుసుకున్నారు. ఈరోడు చైర్మన్ గా ఉన్నపుడు ప్లేగు వ్యాధి సోకి వందలమంది ప్రజలు మరణించారు. జనం భయపడి శవాలను ఎక్కడపడితే అక్కడ వదిలి భయంతో పారిపోయారు. ఈవ్యాధికి ఇంజక్షన్లు వేయించుకుంటే అమ్మవారి (దేవత) ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న మూఢనమ్మకంతో జనం భయపడిపోయారు. పెరియార్ సహచరుతో కలసి శవాలను తన బుజాలపై వేసుకొని శివారు ప్రాంతాల్లో పూడ్పించారు. మనదేశంలో మొట్ట మొదటి సారిగా పట్టణ ప్రాంతాలకు కుళాయి ద్వారా మంచినీటి సరఫరా చేయించిన ఘనత పెరియార్కే దక్కింది. కులప్రాతిపదికన విధ్య, ఉద్యోగ రంగాలలో అణగారిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ మహాసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని బ్రాహ్మణ వర్గమంతా వ్యతిరేకించి కొట్టివేయించింది. దీనికి నిరసనగా 29 గౌరవపదవులకు రాజీనామా చేశారు పెరియార్.
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని వైక్కోం దేవాలయానికి వెళ్లే దారుల్లో దళితులు నడవరాదంటూ శాసనాలుండేవి. ఇందుకు నిరసిస్తూ పెరియార్ పెద్ద పోరాటం నిర్వహించారు. దారుల్లో పందులు, గాడిదలు, పలు రకాల జంతువులు నడుస్తున్నాయ్, సాటి మనుషులు నడవటం నిషేధమా! ఇది మానవ హక్కుల ఉళ్లంఘన అంటూ పెరియార్ ఆ వీధుల్లో దళితుల్ని అంటరాని వారిని నడిపించి చరిత్రని తిరగరాశారు. అలాగే దేవదాసీ దురాచారంపై చట్టాన్ని తీసుకరావాలని పోరాటం చేశారు. దేవాలయంలో ఒక కులానికి చెందిన స్త్రీలు దేవునికి దాసీలుగా నాట్యమాడుతూ రాతి బొమ్మలను రంజింప జేయాలన్న దుష్ట సాంప్రదాయం మూలంగా రెండు వేల సంవత్సరాలుగా స్త్రీలు వ్యభిచార వ్రృత్తిలోకి బలంగా నెట్టబడుతూ వచ్చారని పెరియార్ పోరాటం చేశారు. తన సామాజిక లక్ష్యాలను, చైతన్యాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ఒక పత్రిక ఉండవలసిన అవసరాన్ని గుర్తించి కుడిఅరసు అనే పత్రికను 1925 మే రెండున తొలి సంచికను కాంచీపురంలో ఆవిష్కరించారు. పెరియార్, తన భార్య పలువురు ఉధ్యమకారులతో సింగపూర్, మలేషియా, యూరప్, ఫ్రెంచ్, రష్యా తదితర దేశాల్లో విస్త్రృతంగా ప్రచారాన్ని చేపట్టి సత్యాన్వేషకుల సంఘం, ఉదార ఆలోచనాపరుల సంఘం, హేతువాద సంఘం, దేవుడులేని వాళ్ళ సంఘాలు స్థాపించారు. బాల్య వివాహాలపై పోరాటం చేస్తూ స్త్రీ జాతిని అవమానిస్తున్న బ్రాహ్మణేతరులకు అర్థం కాని మంత్రాలు తంత్రాలతో కూడిన హిందూ పెళ్ళి సాంప్రదాయాలను పాటించకుండా, పురోహితున్ని పిలవకుండా పూల దండలు మార్చుకొని పెళ్ళి చేసుకొనే స్వాభిమాన పెళ్ళి విధానాన్ని పెరియార్ పరిచయం చేశారు. డిసెంబరు 19 న చెన్నపట్నం త్యాగరాయనగర్ లో ఆలోచనా పరుల మండలిలో జరిపిన సదస్సులో తన చివరి సందేశాన్నిస్తూ వేదికపైనే కుప్పకూలిపోయారు పెరియార్. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆ తర్వాత వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చేర్పించారు. డిసెంబరు 23న వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రాత్రి 11గంటలకు స్పృహకోల్పోయి కోమాలోకి వెళ్లి మరునాడు 24 ఉదయం 7-40 నిమిషాలకు మరణించారు.
పీడిత ప్రజల మానాభిమానాల పరిరక్షణకోసం, వారి హక్కుల కోసం సుదీర్ఘకాలం పోరాటం చేస్తూ తిట్లను, నిందల్ని , చెప్పుల దెబ్బల్ని సైతం ఎదుర్కొన్న పెరియార్, లక్షలాది గుండెల్లో నిరుపమాన స్థానాన్ని సంపాదించుకొని మరణం లేని అమరజీవిగా నిలిచిపోయారు. మతతత్వ విషం ఎల్లెడలా వ్యాపిస్తున్న తరుణంలో పెరియార్ జీవితం, పోరాటాలు ఎంత గానో స్పూర్తిదాయకం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa