దేశంలో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం నాడు వెల్లడించింది. అర్హులైన ఓటర్లు 96.88 కోట్ల మంది ఉన్నారని, వీరిలో మహిళా ఓటర్లు 47 కోట్లని తెలిపింది. గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే 6 శాతం ఓటర్లు పెరిగారు. 2019లో ఈ సంఖ్య 91.20 కోట్లు. ఇక, ప్రస్తుతం 18-29 ఏళ్ల మధ్య వయసుగల 2 కోట్ల మంది యువత ఓటరుగా నమోదు చేసుకున్నారని ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా 2.63 కోట్లకుపైగా కొత్త ఓటర్లు పేర్లు నమోదుచేసుకున్నారని, వీరిలో దాదాపు 1.41 కోట్ల మంది మహిళలు ఉన్నారు. కొత్తగా చేరిన పురుష ఓటర్ల (1.22 కోట్లు) కంటే 15 శాతం అధికమని పోల్ అథారిటీ తెలిపింది. 2023లో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 940 మంది స్త్రీ ఓటర్లు ఉండగా.. 2024లో 948కి పెరిగారు.
‘ప్రపంచంలోనే అతిపెద్ద ఓటర్లు.. 96.88 కోట్ల మంది భారతదేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు’ అని ఈసీ చెప్పింది. ఓటర్లు జాబితా సవరణలో పారదర్శకతతో పాటు స్వచ్ఛత, నిబద్ధతపై కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టిందని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పుణేలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి దశలో రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో పాటు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన వివిధ పనులను వివరించారు. దాదాపు 88.35 లక్షల మంది దివ్యాంగ ఓటర్లకు మద్దతు ఇచ్చే ప్రయత్నం జరిగిందని ఈసీ నొక్కి చెప్పింది. ఇది పోలింగ్ రోజున వారు ఓటుహక్కును వినియోగించుకునేలా నిర్ధారిస్తుంది. 2019లో దివ్యాంగ ఓటర్ల సంఖ్య 45.64 లక్షలు. ఇంటింటి సమగ్ర ధ్రువీకరణ తర్వాత 1.65 కోట్ల మందికి పైగా మరణించిన, శాశ్వతంగా బదిలీ అయినవారు, నకిలీ ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.
‘ఈ సమగ్ర విధానం ఎన్నికల ప్రక్రియ సమగ్రత, స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. ఇందులో 67.82 లక్షల మంది చనిపోయిన ఓటర్లు, 75.11 లక్షల మంది శాశ్వతంగా మారిన లేదా గైర్హాజరైన ఓటర్లు.. 22.05 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారు’ అని ఈసీ తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్ల 2014లో 39.68 వేలు ఉండగా.. ప్రస్తుతం స్వల్పంగా పెరిగి 48,000కు చేరింది. ఓటర్ల జాబితాలో చేరేందుకు 17 ఏళ్లు పైబడిన వారి నుంచి 10.64 లక్షల ముందస్తు దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 18 ఏళ్లు నిండని వ్యక్తులు ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఓటు వేసే వయస్సు వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఓటరు గుర్తింపు కార్డులు అందుతాయి. అలాగే, 80 ఏళ్లు దాటిన ఓటర్లు 1.85 కోట్లు, వందేళ్లు దాటినవారు 2.38 మంది ఉన్నట్టు ఈసీ పేర్కొంది. ఇక, దేశంలో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 15.30 కోట్ల ఓటర్లు, అత్యల్పంగా లక్షదీప్‌లో 57,000 మంది ఓటర్లు ఉన్నారు.