పల్నాడు జిల్లా నాగవరంలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాసివచ్చిన విద్యార్థిని అంతలోనే కన్నుమూసింది. దీంతో కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. పల్నాడు జిల్లా నాగవరానికి చెందిన 15 ఏళ్ల చిన్నారి.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బృగుబండలో ఉన్న పరీక్షా కేంద్రంలో బుధవారం పరీక్ష రాసింది. అయితే పరీక్ష రాసి ఇంటికి వచ్చిన చిన్నారి అస్వస్థతకు గురైంది. ఇంటికి వచ్చిన కాసేపటికే చిన్నారి అస్వస్థతకు లోనైంది. దీంతో కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు. వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే చిన్నారి కన్నుమూసింది. దీంతో కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్లముందే కన్నుమూయటంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు.మరోవైపు చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు తెలియజేశారు. ఇక గుండెపోటు మరణాలు తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య తరుచుగా జరుగుతూ ఉన్నాయి. 60 ఏళ్ల వయసున్న వారి నుంచి 10 ఏళ్లలోపు వారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు.
తాజాగా బుధవారమే తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలోనూ ఓ 14 ఏళ్ల బాలుడు కన్నుమూశాడు. 8వ తరగతి చదువుతున్న సాయితేజ అనే బాలుడు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. సాయితేజ కూడా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి సాయితేజ గుండెలో రంధ్రం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆపరేషన్ చేయించేందుకు ఆర్థిక స్థోమత సరిపోకపోవటంతో.. బాలుడి తల్లిదండ్రులు ఆపరేషన్ చేయించలేకపోయారు. ఈ క్రమంలోనే సాయితేజ గుండెపోటుతో కన్నుమూశాడు.