ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల సిత్రాలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక పార్టీలోని నేత పేరుతో మరో పార్టీ సర్వే చేయించడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయం ఇప్పుడు సీమ జిల్లాలలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి కోసం పోటీపడుతున్నవి ప్రత్యర్థి పార్టీలు కాదండోయ్. కూటమిలోనే పార్టీలే.. ఈ నేపథ్యంలో ఆయనకు ఏ పార్టీ నుంచి టికెట్ వస్తుంది, ఏ పార్టీ తరుపున ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అసలు సంగతిలోకి వస్తే.. పీవీ పార్థసారథి. ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఈయన కర్నూలు లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే పోటీచేయాలని ఆశించారు. అయితే కర్నూలు ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించలేదు. కర్నూలు బదులుగా రాయలసీమలోని తిరుపతి, రాజంపేట ఎంపీ సీట్లను బీజేపీకి కేటాయించింది. అలాగే కర్నూలు జిల్లాలో ఆలూరు లేదా ఆదోని అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ సీటు దక్కని పార్థసారథి.. ఈ రెండింటిలో ఏదో ఒక స్థానం నుంచి పోటీచేయాలని ట్రై చేస్తున్నారు.
అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ నెలకొంది. పార్థసారథి పేరుతో టీడీపీ సర్వే చేయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతపురం పార్లమెంట్ స్థానానికి పార్థసారథి పేరుతో టీడీపీ నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయట. అయితే బీజేపీలో ఉన్న నేత అభ్యర్థిత్వంపై టీడీపీ నుంచి సర్వే జరుగుతూ ఉండటం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి ఆశిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దించాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. ఈ క్రమంలోనే బీసీ నేత అయిన పార్థసారథి పేరుతో ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పార్థసారథిపై టీడీపీ, బీజేపీ నేతల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మరి పార్థసారథి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు , ఎక్కడి నుంచి బరిలో ఉంటారనేదీ చూడాలి మరి.