ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తుల్లో భాగంగా కొంత మంది నేతలకు చంద్రబాబు టికెట్లు ఇవ్వలేక పోయారు. వారిని ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించారు. ఇందులో భాగంగానే మూడు కీలక నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్నికలకు సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు. అనంతపురం, మంత్రాలయం, గుంతకల్లు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సమయంలో నేతలతో చంద్రబాబు రెండు గంటల పాటు చర్చించారు.అయితే.. అనంతపురం టికెట్ రాలేదని అసంతృప్తిగా ఉన్న ప్రభాకర్ చౌదరితో చంద్రబాబు మాట్లాడారు. అనివార్య కారణాలతో టికెట్ ఇవ్వలేక పోయామని చౌదరికి చంద్రబాబు సర్ది చెప్పారు. అనంతపురం జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయ బాధ్యతలు చూడాలని ప్రభాకర్ చౌదరిని కోరారు. మంత్రాలయం తిక్కారెడ్డి, గుంతకల్లుకు చెందిన జితేంద్రగౌడ్‌లకు కూడా చంద్రబాబు సర్థి చెప్పారు. వీరు ఇరువురునీ కూడా పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. చంద్రబాబుతో జరిగిన చర్చల పట్ల నేతలు సంతృప్తి చెందారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.