దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ కొత్త ఏడాదిలో వరుసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు నెలల కాలంలో చూసుకుంటే తులం బంగారం ధర ఏకంగా 15 శాతం పెరిగింది. 2024 ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత పనితీరు కనబరిచిన అసెట్‌గా గోల్డ్ నిలిచింది. అలాగే వెండి సైతం పరుగులు పెడుతూనే ఉంది. జనవరి 1 నుంచి చూస్తే 13 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు రూ. 74 వేలు దాటింది. అలాగే కిలో వెండి రేటు రూ. 87 వేల మార్క్ దాటింది. రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో బంగారం ధర త్వరలోనే లక్ష రూపాయల మార్క్ చేరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతకు ముందే వెండి ఆ మార్క్ చేరుకోవచ్చనేది బులియన్ మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు.
విలువైన ఖనిజాల ధరలు పెరిగేందుకు కీలకమైన కొన్ని అంశాలు సానుకూలంగా ఉన్నందున బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే గోల్డ్, సిల్వర్ రేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. బంగారం ధరలు పెరిగేందుకు కారణమైన అంశాల్లో ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తాయన్నా అంచనాలు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు, భౌగోళిక అంశాలు, ఉక్రెయిన్ పరిస్థితులు ఉన్నాయి.
అలాగే బంగారం ధరలు పెరిగేందుకు ప్రధానంగా కారణమవుతున్న అంశాల్లో వడ్డీ రేట్లు కీలకంగా మారుతున్నాయి. వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పుడు బంగారానికి గిరాకీ తక్కువగా ఉంటుంది. 2022, 2023లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో బంగారం ధరలు తగ్గాయి. కానీ, గత కొద్ది కాలంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తోంది. ముందు ముందు మరింత తగ్గించే అవకాశం ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ అంచనాలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక అంశాలపై రానున్న నెలల్లో మార్కెట్లు ఆధారపడతాయని, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు.. గత కొద్ది నెలలుగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిలువలను పెంచుకుంటున్నాయి. భారీగా బంగారం కొంటున్నాయి. దీంతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా, యూరప్, రష్యా నిల్వలను స్తంభింపజేయడంతో కొన్ని దేశాలు తమ అమెరికా డాలర్ నిల్వలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా దేశాలు బంగారం వైపు మళ్లుతున్నాయని వార్తా నివేదికలు చెబుతున్నాయి. చైనా వంటి దేశాలు డాలర్ ప్రాధాన్యతను తగ్గించేందుకు బంగారం నిల్వలు పెంచుకుంటుండడమూ గోల్డ్ రేట్లు పెరిగేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.