చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు.. నానమ్మ కష్టపడి చదివించింది. గతంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా వచ్చింది.. కానీ జీవితంలో ఇంకా ఏదో సాధించాలని ఆ యువకుడు పట్టుదలతో కష్టపడి చదివాడు.. మూడు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయినా సరే పట్టు వీడలేదు.. అనుకున్నది సాధించాడు.. సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి తండ్రిది సాదాసీదా రైతుకూలీ కుటుంబం. ఐదేళ్ల వయసులో తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి శ్రీనివాసులురెడ్డి భరోసా, నానమ్మ రమణమ్మ బాధ్యతలు చూశారు. తండ్రి ఉదయ్‌కు సివిల్స్ గురించి చిన్నప్పటి నుంచే చెబుతూ వచ్చారు. ఇంతలో.. ఇంటర్ చదువుతున్న సమయంలో భరోసాగా ఉన్న తండ్రి కూడా కన్నుమూశారు. తల్లిదండ్రుల మరణంతో ఉదయ్‌తో పాటూ సోదరుడు కూడా కుంగిపోయారు.
తండ్రి, తల్లి చనిపోయారు.. ఆ సమయంలో వారికి నాయనమ్మ కొండంత అండగా నిలిచారు. నాయనమ్మ రమణమ్మ అప్పటి నుంచి ఇద్దరు మనవళ్ల చదువు కోసం కష్టపడ్డారు. మనవడు ఉదయ్‌కృష్ణారెడ్డిని సొంత ఊరిలోనే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివించారు. సెలవుల్లో నాయనమ్మకు చేదోడుగా ఉంటూనే నెల్లూరు జిల్లా కావలిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేశారు. ఉదయ్ చదువంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే సాగింది. నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే 2012లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరులో నాలుగేళ్లు, ఆ తర్వాత ఉలవపాడు మండలం రామాయపట్నం మెరైన్ స్టేషన్‌లో కొన్నాళ్లు విధులు నిర్వహించారు.
తల్లీతండ్రీ లేని కుటుంబం.. వృద్ధురాలైన నాయనమ్మ కూడా కూరగాయలు అమ్మి కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. అప్పుడప్పుడూ నాయనమ్మతో పాటూ కూరగాయలు అమ్మేవారు.. ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగమంటే కొండంత అండ. కానీ ఉదయ్‌లో మాత్రం ఏదో వెలితి.. కానిస్టేబుల్ ఉద్యోగంతో సంతృప్తి చెందలేదు. తండ్రి చెప్పినట్లు ఎలాగైనా సివిల్స్ లక్ష్యాన్ని అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు. వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు.. సివిల్స్ దిశగా అడుగులు వేశారు. నాయనమ్మ రమణమ్మ కూరలమ్మిన డబ్బుతో కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా చూశారు.
ఉదయ్ చేస్తున్న ఉద్యోగాన్ని, ఉన్న ఊరునీ వదిలి హైదరాబాద్ వచ్చారు.. అక్కడ సివిల్స్ శిక్షణ తీసుకున్నారు. నాలుగేళ్లపాటు కష్టపడి చదివారు.. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించినా.. మెయిన్స్‌లో వెనుతిరగాల్సి వచ్చింది. అయినా కుంగిపోకుండా మరింత కష్టపడ్డారు..ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలయ్యారు ఉదయ్.. అయినా నిరాశ చెందలేదు. తనవల్ల కాదని లక్ష్యాన్ని వదల్లేదు.. నాన్న కల, నానమ్మ కష్టం, అందరి ప్రోత్సాహం గుర్తు చేసుకుని మళ్లీ కష్టపడ్డారు. ఈసారి మరింత పట్టుదలతో మరోసారికి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. తాజా ఫలితాల్లో 780 ర్యాంకు సాధించారు.. ఇప్పుడు ఉదయ్ స్ఫూర్తితో తమ్ముడు ప్రణయ్ రెడ్డి కూడా సివిల్స్‌పై దృష్టిపెట్టి విజయం సాధిస్తానని చెబుతున్నారు. డిగ్రీ పూర్తిచేసిన ప్రణయ్ ప్రస్తుతం గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నారు.
చిన్నప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొని.. మూడుసార్లు ఓటమి ఎదురైనా లక్ష్యం దిశగా పట్టుదలతో అడుగులు వేసిన ఉదయ్ అనుకున్నది సాధించారు. ఉదయ్ ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యే అవకాశముంది. అంతేకాదు గతంలో జరిగిన ఘటనల్ని కూడా గుర్తు చేసుకున్నారు ఉదయ్. తన తప్పు లేకున్నా.. వ్యక్తిగత కక్షతో అరవై మంది పోలీసుల ముందు ఓ సీఐ తనను అవమానించారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు. ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో చదివానన్నారు. ఐఆర్‌ఎస్ వస్తుందని.. ఆ జాబ్‌లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఆ సమయంలో సీఐ చేసిన అవమానమే సివిల్స్ సాధించేందుకు దోహదపడిందన్నారు.