ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకత్వానికి, ఉత్తర్‌ప్రదేశ్ అటవీశాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘దేశంలో అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రం, శైవ క్షేత్రమైన వారణాశిలో నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు. ముఖ్యంగా కాశీలోని విశ్వేశ్వరునికి అభిషేకం, ఆ దివ్య క్షేత్రం సందర్శనకు సహకారం అందించిన బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగనే తన పర్యటన భక్తిపూర్వకంగా సాగడానికి వెన్నంటి ఉన్న యూపీ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అరుణ్ కుమార్ సక్సేనాకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. కాగా.. వారణాసి లోక్‌సభ అభ్యర్థిగా ప్రధాన మంత్రి మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కూటమి నేతలు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.