మున్సిపల్ ఆస్తుల ఆక్రమణలపై ఏ చర్యలు తీసుకున్నారని అధికార పక్ష కౌన్సిలర్ గొవ్వాల రాజేష్ ప్రశ్నించారు. అమలాపురం పట్టణంలో పలుచోట్ల ఆక్రమణలు జరిగినా నామమాత్రంగానే కోర్టులో కేసులు దాఖలు చేయడంపై మండిపడ్డారు. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన సోమవారం జరిగింది. కౌన్సిలర్ రాజేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఆక్రమణలపై ఎన్ని కేసులు నమోదు చేశారో వెల్లడించాలని డిమాండు చేశారు. దాంతో టౌన్ ప్లానింగ్ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇప్పటివరకు 62 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, మరో 22 కేసులు పంపించినప్పటికీ వాటికి నెంబర్లు వేయకుండా వెనక్కి పంపించేశారని వివరించారు. ఇవికాక మరో ఏడెనిమిది కేసులు గుర్తించామని వెల్లడించారు. ఇక అంతకుమించి ఆక్రమణలు లేవా అని సభ్యులు నిలదీశారు. పురపాలక సంఘం చెంతన ఉన్న షాపు లీజుకు ఇచ్చిన అంశంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా మళ్లీ వేలం పాటలు ఎలా నిర్వహించాలని అనుకున్నారని కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర ప్రశ్నించారు. కమిషనర్ మనోహర్ మాట్లాడుతూ చైర్‌పర్సన్ ముందస్తు అనుమతి తీసుకుని వేలంపాట నిర్వహించినట్టు వెల్లడించారు. నెలకు రూ.1.06 లక్షలు లీజుకు ఇచ్చి ఇప్పుడేమో వ్యాపారాలు లేవు, అద్దెలు చెల్లించలేమని లేఖ రాస్తే మీరెలా అంగీకరిస్తారని సభ్యులు ప్రశ్నించారు. నాలుగు పర్యాయాలు వేలంపాటలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కౌన్సిలర్ దొమ్మేటి రాము ప్రశ్నించారు. వేలంలో ఆ షాపును మరొకరికి కట్టబెట్టడానికి ఆయనేమన్నా మున్సిపాలిటీకి దత్తపుత్రుడా, ఇదే పరిస్థితి కొనసాగితే పట్టణంలో పలువురు వ్యాపారులు అద్దెలు చెల్లించలేమని, తాళాలు వేసుకుని వెళ్లిపోతే ఏంచేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే పలువురు వ్యాపారులు కౌన్సిలర్ల చుట్టూ తిరుగుతున్నారని వివరించారు. తాము కౌన్సిల్ ఆమోదం కోసమే ఎజెండాకు తీసుకువచ్చామని కౌన్సిల్‌దే తుది నిర్ణయమని కమిషనర్ చెప్పారు. మున్సిపల్ ఆదాయానికి గండిపడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త లు తీసుకోవాలని సభ్యులు సూచించారు. దాంతో అంశాన్ని వాయిదా వేయాలని కౌన్సిలర్ రాము సూచించడంతో అంగీకరించారు. పురపాలక సంఘం నుంచి భవన నిర్మాణాలకు ఇష్టానుసారం అనుమతులు ఇస్తున్నారని కౌన్సిలర్ నాగేంద్ర అధికారులను నిలదీశారు. పట్టణంలో 14 సెంట్ల స్థలంలో భవనాలు కడితే నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత యేడిద శ్రీను మాట్లాడుతూ వ్యాపారాలు లేక దుకాణాలు మూసి పురపాలక సంఘానికి కట్టాల్సిన సొమ్ములను జమచేసి తాళాలు అప్పగించినా ఇంకా నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అయితే కొత్తవాళ్లు షాపులు తీసుకునే వరకు అద్దెలు చెల్లించాల్సిందేనని కమిషనర్ స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ జిల్లా నుంచి చమురు, సహజవాయువులను దోచుకుపోతున్నారని, వారు అపర కుబేరులు అవుతుంటే స్థానిక రైతులు బికారులుగా మారుతున్నారని విమర్శించారు. కోనసీమ ప్రాంతం సముద్ర గర్భం లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్టు తెలిపారు. అందుకు కౌన్సిలర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో వైస్‌చైర్మన్ రుద్రరాజు నానిరాజు, కౌన్సిలర్లు ఆశెట్టి నాగదుర్గ, పిండి అమరావతి, గండి దేవీహారిక, తిక్కా సత్యలక్ష్మి, అబ్బిరెడ్డి చంటి, బొర్రా వెంకటేశ్వరరావు, వాసర్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa