కౌంటింగ్ కేంద్రాలలో ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా, ఇతర పార్టీల అభ్యర్థులను, ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ హెచ్చరించారు. భీమవరం, ఆచంట, పెనుగొండ, తణుకుల్లో ఆయన పర్యటించారు. కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడుతున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లోని పరిస్థితిపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను ఐజితోపాటు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మంగళవారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి ఏర్పాటు చేసిన మార్గాలను పరిశీలించి, దిక్సూచి బోర్డులను ఏర్పాటు చేయాలని ఐజీ అధికారులకు సూచించారు. ‘కౌంటింగ్ కేంద్రాలలో వీడియో చిత్రీకరణ ఉండాలి. అభ్యర్థులకు, ఏజెంట్లకు సంబంధిత అధికారులు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లే వారి వద్ద సెల్‌ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలకా్ట్రనిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలి. కేంద్రాల నుంచి 100 మీటర్లు దూరంలో వాహనాలను నిలిపివేయాలి. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు టీవీ ద్వారా ఫలితాలను తెలుసుకోవాలని, రోడ్లపైకి రావద్దు. పోటీ చేసిన అభ్యర్థుల నివాసాల వద్ద పికెట్లు ఏర్పాట్లు చేశాం. ఆయా ప్రాంతాల్లో ఘర్షణలు జరకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎక్కడా ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా సహకరించాలి’ ఐజీ కోరారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అజిత హెచ్చరించారు. బాటిళ్లల్లో పెట్రోల్, డీజీల్ నింపడం నిషేధమన్నారు. వారి వెంట ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీలు వి.నారాయణస్వామిరెడ్డి, జి.శ్రీనివాసరావు, ఎం.సత్యనారాయణ, నున్న మురళీకృష్ణ, సీఐ ఎన్. రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa