14వ శాసనసభ 13వ సెషన్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి మొదలవుతాయని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. అసెంబ్లీ భవనంలోని తన ఛాంబర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. 5ఏళ్ళ కాలానికి ఇవే చివరి సమావేశాలని తెలిపారు. మొదటిరోజు ఆంధ్రప్రదేశ్ ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారని చెప్పారు. 31వ తేదీ ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, సభ్యులు కిడారి సర్వేశ్వరరావు మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెడతారని, చర్చ జరిగిన తరువాత సంతాపం తెలుపుతారని, ఆ తరువాత సభ వాయిదా పడుతుందని వివరించారు. సభకు 1, 2, 3, 4 తేదీలు సెలవులని చెప్పారు. మళ్లీ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులు సభ జరుగుతుందన్నారు. 5వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తరువాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఆ తరువాత రోజుల్లో ప్రభుత్వ బిల్లులు, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహిస్తామన్నారు. మార్చి 31 తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పడే వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఓట్ ఆన్ అకౌంట్ పేరుతో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం రాజ్యాంగంలోని 16వ ఆర్టికల్ లోని నిబంధనలకు విరుద్దమని తెలిపారు. శాసనసభ సమావేశాలకు అందరు సభ్యులు హాజరైతే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరు సభ్యులు హాజరుకాకపోతే, స్పీకర్‌కు అసంతృప్తి ఉంటుదని చెప్పారు. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఇచ్చానన్నారు. ప్రజా సమస్యలు చర్చించడానికి శాసనసభ సరైన వేదిక అని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం వారు దానిని ఉపయోగించుకోలేదన్నారు. సమావేశంలో శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె.సత్యనారాయణరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa