అమెరికాలో తెలుగు విద్యార్థులను ఫేక్ యూనివర్సిటీ ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆ విద్యార్థులకు అవసరమైన చట్టపరమైన సహాయం కోసం అమెరికా తెలుగు సంఘం(ఆటా) తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అరస్టైన భారతీయ విద్యార్థులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆటా అధ్యక్షుడు పరమేష్ బీంరెడ్డి తెలిపారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆటా టీమ్‌లను అప్రమత్తం చేసినట్లు ఆయన వివరించారు. అమెరికాలోని డెట్రాయిట్‌లో అక్కడి అధికారులు అరెస్ట్ చేసిన తెలుగు విద్యార్థులకు న్యాయ సాయం చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) రంగంలోకి దిగింది. నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అమెరికాలో న్యాయనిపుణులతో చర్చలు ప్రారంభించారు. న్యూజెర్సీలోని ప్రముఖ న్యాయ నిపుణులు, తెలుగువారైన శ్రీనివాస్ జొన్నలగడ్డతో విద్యార్థులను విడిపించాలన్న అంశంపై సంప్రదింపులు చేస్తున్నారు. నకిలీ మాస్టర్ డిగ్రీలతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 200 మంది తెలుగువారిని డెట్రాయిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.