పురాణ కథలు చెప్పుకోడానికి, వినడానికి బాగుంటాయి. అయితే.. ఇందులో నిజమెంత? కల్పితమెంతన్న క్లారిటీ కోసమైతే ఎవరికివాళ్లు తడుముకోవాల్సిందే! ఇటువంటిదే కింగ్ ఆర్థర్ అండ్ మెర్లిన్ కథ! తొమ్మిదవ శతాబ్దం నుంచి సాహిత్య ప్రక్రియలో చెలామణీలో వున్న అర్ధేరియన్ శకం గురించి ఎవ్వరి దగ్గరా ఆనవాళ్లు ఉండేవి కావు. మెర్లిన్ అనే రాజు గొప్ప ఇంద్రజాలికుడని, మంచి కలర్‌ఫుల్ క్యారెక్టర్ అనీ చెప్పుకునేవారు. పురాతన ఫ్రెంచ్ లిటరేచర్ సీక్వెన్స్‌లోని ఈ పుక్కిటి పురాణం నిజమేనని ఎట్టకేలకు తేలిపోయింది.
ఇటీవల దాదాపు 700 ఏళ్ల నాటి తాళపత్రాలు బయటపడ్డాయి. 13వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన మ్యాన్యుస్క్రిప్ట్స్‌లోంచి ఏడు పేజీల్ని డీకోడ్ చేయడం ద్వారా ‘ఆర్ధర్ అండ్ మెర్లిన్’ కథకు సంబంధించిన నేపథ్యం కనిపించిందట. బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన అకడమీషియన్లు ఈ తాళపత్రాల మీద ఇంకా లోతైన పరిశోధన జరుపుతున్నారు. కటింగ్-ఎడ్జ్, ఇన్‌ఫ్రారెడ్ లాంటి అధునాతన టెక్నాలజీల ద్వారా ఈ పురాతన గద్యాల్ని చదవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 12 అంగుళాల పొడవున్న ఈ పుటల్లో వాడిన భాష మాత్రం ఆంగ్లానికి భిన్నంగా ఉన్నట్లు గ్రహించారు.
కింగ్ ఆర్ధర్ 5, 6 శతాబ్దాల్లో బ్రిటన్ రాజ్యాన్ని ఏలినట్లు చరిత్రకారులు నమ్ముతారు. ఇంగ్లీష్ రచనల్లో రాసివున్న కథనాలకు ఈ తాళపత్రాల్లో పేర్కొన్న అంశాలకు వైరుధ్యం ఉందని తెలుస్తోంది. బ్రిస్టల్ సెంట్రల్ లైబ్రరీలోని 16వ శతాబ్దం నాటి పుస్తకాల దుమ్ము దులుపుతున్నప్పుడు, అంతకంటే పురాతనమైన ఈ మ్యాన్యుస్క్రిప్ట్స్ బైటపడ్డాయని, వీటిని పరిశోధిస్తే మధ్యయుగం నాటి మరిన్ని పురాణ కథలపై క్లారిటీ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అర్ధేరియన్ రచయితల్లో మొదటివాడు 12వ శతాబ్దం నాటి Geoffrey of Monmouth. బ్రిటన్ రాజరికంపై ఆయన రాసిన పుస్తకాల్ని కూడా ఈ సందర్భంగా బైటికి తీసి, పరిశోధిస్తున్నారు.