ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని కోసం ఈ ఏడాదికి రూ. 29.39 కోట్లు విడుదల చేయగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో రూ. 85.84 కోట్ల నిధులు కేటాయించారు. విద్యార్థులను చదువు వైపు మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు భోజనం అందించింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని రద్దు చేసింది. అమ్మఒడి ఇస్తున్నామనే వంకతో వారికి భోజనం దూరం చేసింది. అయితే నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు తమకు మళ్లీ ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హామీ ఇచ్చిన లోకేశ్ అధికారంలోకి రాగానే పథకం అమలుకు జీవో జారీ అయ్యేలా కృషి చేశారు.