ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభుత్వంలో ఏమి చెయ్యలేదు అనే లోకేష్ కి ఇదే నా సవాల్ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు. అయన మాట్లాడుతూ...... దీర్ఘకాలంగా ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారం కోసం రూ.700 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, వాటర్ ప్రాజెక్టు తీసుకొచ్చాం. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మూలపేట పోర్టు నిర్మాణం మొదలు పెట్టాం. విజయనగరం, పాడేరుల్లో మెడికల్ కాలేజీలు నిర్మించాం. కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ తీసుకొచ్చాం. సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశాం. కోర్టు కేసులను పరిష్కరించి అన్ని అనుమతులు సాధించి ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం మొదలు పెట్టడంతో పాటు, 2002 ఎకరాలు సమీకరించి పునరావాస పనులు కూడా పూర్తి చేయడం ఖచ్చితంగా మా ఘనతే. ఆ మొత్తం భూమికి ప్రహరీ నిర్మించాం. 2023 మేలో పనులు ప్రారంభించాం. ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమంలో ఉన్న ప్రాజెక్టులన్నీ మేం తెచ్చినవే. – ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను ప్రధానితో భూమి పూజ చేయిస్తున్నారు. ఇది గత ప్రభుత్వంలో జగన్‌గారి చొరవతో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా తీసుకొచ్చిందే. అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీకి ఇచ్చిన 1300 ఎకరాలకు వయబిలిటీ లేదని చెప్పడంతో ప్రత్యామ్నాయంగా విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో వారితో చర్చించి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌పై అప్పటి సీఎం జగన్, ప్రకటన చేయించి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇందుకోసం అన్ని అనుమతులు ఇచ్చాం. సాధించాం. గతేడాది జనవరి–ఫిబ్రవరిలో భూమి పూజ చేయాలనుకున్నా, ప్రధానమంత్రి గారికి సమయం కుదరలేదు. ఆ తర్వాత కోడ్. ఇది నిజం కాదా?. బల్క్ డ్రగ్ పార్క్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి దాన్ని సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ. ఇది ఖచ్చితంగా నాటి సీఎం వైయస్ జగన్ గారి ఘనత కాదా?. ఈ పరిశ్రమను మొదట కాకినాడలో పెట్టాలనుకున్నాం, సాధ్యం కాకపోవడంతో, నక్కపల్లిలో 5వేల ఎకరాలు గుర్తించి ప్రతిపాదనలు పంపాం. రైల్వై జోన్‌కి మా ప్రభుత్వ భూములే ఇవ్వలేదని లోకేష్ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. రైల్వే శాఖకు 52 ఎకరాలు కేటాయిస్తూ, జీవీఎంసీ కమిషనర్ గత ఏడాది జనవరి 2న, ఆర్డర్ ఇచ్చారు అంటూ ప్రెస్‌మీట్‌లో దాన్ని చూపారు. ఇవేవీ నిజం కావని లోకేష్ చెప్పగలరా? ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధికి సంబంధించి, మేమేం చేశామనే వాటిపై బహిరంగ చర్చకు సిద్ధం. మరి మీకు ఆ దమ్ముందా? అందుకే ఇకనైనా తమపై బురద చల్లడం మానాలని, వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పనులు చేసి చూపాలని గుడివాడ అమర్‌నాథ్ తేల్చి చెప్పారు.