చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే పంతులమ్మలపై శిక్షణ తరతుల్లో ఓ అధికారి దురుసుగా ప్రవర్తించారు. ఒంగోలులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. 1, 2 తరగతుల విద్యార్థులకు ఉత్తమ విద్య అందించేందుకు 60 రోజుల సర్టిఫికెట్ కోర్స్ శుక్రవారం నుంచి మొదలైంది. ఈనెల 8వ తేదీ వరకు స్థానిక మంగమూరు రోడ్డులోని రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయి. తొలిరోజు జిల్లా నలుమూలల నుంచి 180 మంది ఉపాధ్యాయులను ఆహ్వానించారు. 100 మంది వరకు మహిళా ఉపాధ్యాయులు వచ్చారు. 80 మంది పురుష ఉపాధ్యాయులున్నారు. శిక్షణ ఇచ్చే సమయంలో మహిళా ఉపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులు వేరువేరుగా కూర్చున్నారు. అయితే మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుకుంటున్నారని ఆ శిక్షణకు నాయకత్వం వహించే ఒక అధికారి వారిపై దురుసుగా ప్రవర్తించారు. మహిళా ఉపాధ్యాయురాలు ఆయన్ను తిరిగి ప్రశ్నించారు. ఆ కారణంతో అధికారి ఆమెను పురుష ఉపాధ్యాయుల పక్కన కూర్చోవాలన్నారు. ఆమె నిరాకరించారు. కోపోద్రిక్తుడైన అధికారి వెంటనే ఒక బెంచిపై ఆ మహిళా ఉపాధ్యాయురాలిని మధ్యలో కూర్చోబెట్టి ఇరువైపులా పురుష ఉపాధ్యాయులను కూర్చోబెట్టారు. ఉన్నత చదువు చదువుకొని ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలంపాటు పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలి పట్ల అధికారి వ్యవహరించిన తీరుపై మిగిలిన టీచర్లు మండిపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు ఆ అధికారిని తొలగించి ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు మరో అధికారిని నియమించాలని కోరారు.