విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన కోడికత్తి కేసు విచారణకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. జగన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్, ఆయన తరఫు న్యాయవాది సలీం, దళిత సంఘాల నేతలు కోర్టుకు వచ్చారు. అయితే కేసులో సాక్షిగా వాగ్మూలం ఇవ్వాల్సిన జగన్ మాత్రం కోర్టుకు రాలేదు. గత ఐదేళ్లపాటు తాను ముఖ్యమంత్రినని, చాలా బిజీబిజీగా ఉన్నానంటూ కోర్టు విచారణకు డుమ్మా కొట్టారు. అయితే ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే జగన్ ఉన్నారు. ఇదే విషయాన్ని న్యాయవాది సలీం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదోపవాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు విచారణనను నవంబర్ 15కి వాయిదా వేసింది.
అయితే విచారణ అనంతరం న్యాయవాది సలీం, దళిత సంఘాల నేత బూసి వెంకటరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై నిప్పులు చెరిగారు. ఐదేళ్లపాటు విచారణకు హాజరు కాకుండా, వాంగ్మూలం ఇవ్వకుండా కోర్టులను వైఎస్ జగన్ అపహస్యం చేస్తున్నారని సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశే ఓ పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయ్యారని గుర్తు చేశారు. ప్రస్తుతం సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న జగన్ ఎందుకు కోర్టుకు హాజరు కావడం లేదని ఆయన ప్రశ్నించారు. జైల్లో ఉన్న వైసీపీ నేతలను కలిసేందుకు వెళ్లినప్పుడు లేని అభ్యంతరం జగన్‌కు ఇప్పుడెందుకని దళిత నేత బూసి వెంకటరావు ప్రశ్నించారు. వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయనకు ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలని నిలదీశారు. ఇంకా ఎన్నాళ్లు వ్యవస్థల నుంచి తప్పించుకుని తిరుగుతారని బూసి వెంకటరావు మండిపడ్డారు.