దేశంలో పౌరులకు గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఉన్నట్లే.. ఒక దేశం, ఒక స్టూడెంట్ కార్డు పేరుతో కేంద్రం విద్యా్ర్థుల కోసం అపార్ తీసుకొచ్చింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) తీసుకువచ్చింది. అయితే విద్యార్థుల అపార్ నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థి పుట్టినప్పటి వివరాలు.. ఆధార్ కార్డులో ఉన్న వివరాలు తప్పుగా ఉండటమే ఇందుకు కారణం. విద్యార్థి వివరాలను అడ్మిషన్ రిజిస్టర్‌తో పాటు యూడైస్‌లో పొందుపరిచారు. అపార్ నమోదు సమయంలో ఆధార్ కార్డు వాడటంతో.. ఆధారు కార్డులో పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి మిగతా వివరాలు అడ్మిషన్ రిజిస్టర్, యూడైస్‍లతో పోలిస్తే వేర్వేరుగా ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
మరోవైపు విద్యార్థుల ఆధార్ సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవల అక్టోబర్ 22 నుంచి 25 వరకూ ఆధార్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కేంద్రాల్లో కేవలం ఫోన్ నంబర్ అప్ డేట్ వంటి చిన్న చిన్న సమస్యలను మాత్రమే కరెక్షన్స్ చేస్తున్నారు. తండ్రి పేరు, పుట్టినరోజు వివరాల్లో తప్పులు ఉంటే కరెక్షన్ చేసేందుకు బర్త్ సర్టిఫికేట్లు అడుగుతున్నారు. దీంతో బర్త్ సర్టిఫికేట్లు లేని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బర్త్ సర్టిఫికేట్లు ఇప్పటికిప్పుడు పొందేందుకు కూడా అవకాశం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లో జన్మించిన వారికి బర్త్ సర్టిఫికేట్ల సమస్య పెద్దగా ఉండటం లేదు.
కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లవద్ద పుట్టినవారికి ఈ పుట్టినరోజు ధ్రువపత్రం సమస్య వస్తోంది. నిరక్షరాస్యత, బర్త్ సర్టిఫికేట్‌కు దరఖాస్తు చేసుకోకపోవటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అపార్‌లో నమోదు చేసేముందు ఆధార్ కార్డులో, స్కూలు అడ్మిషన్ రిజిస్టర్‌లో వివరాలు ఒకేలా ఉన్నాయో లేదో సరిచూసుకోవటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
దేశవ్యా్ప్తంగా ఉన్న విద్యార్థులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను కల్పించేందుకు ఈ అపార్ తీసుకువచ్చారు. దీని ద్వారా వారి అకడమిక్ డేటా, రివార్డులు, డిగ్రీలు, స్కాలర్ షిప్పులు వివరాలు ఆన్‌లైన్‌లో ఒకేచోట ఉంటాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న విద్యార్థులకు ఈ అపార్ కార్డును జారీ చేస్తారు. అపార్ కార్డు విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు బదిలీ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికి పాఠశాలలు, కళాశాలలు ఈ కార్డును ఇస్తాయి.