ఓ భారతీయ యువకుడు అధికారులను బోల్తా కొట్టించి.. వారం రోజుల పాటు బ్రెజిల్ విమానాశ్రయంలో దర్జాగా మకాం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలోని అచనైచ గ్రామానికి చెందిన గౌరవ్ అనే యువకుడు వీసా ఆన్ అరైవల్ ఫెసిలిటీతో ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు బయలుదేరాడు. ఢిల్లీలో విమానం ఎక్కిన అతడు.. అడిస్ అబాబా నుంచి సావో పాలో (బ్రెజిల్) మీదుగా బొలీవియా (Bolivia) వెళ్లాల్సి ఉంది. అయితే, సావోపాలో విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రిటర్న్ టికెట్ లేనందున బొలీవియాకు వెళ్లేందుకు అతడ్ని విమానాశ్రయ సిబ్బంది అనుమతించలేదు.
తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని విమానాశ్రయ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది. కానీ, అలీ అనే ఏజెంట్ సలహా మేరకు అతడు విమానాశ్రయంలోని ట్రాన్సిట్ ఏరియాలో ఉండిపోయాడు. వారం రోజులుగా ఉన్నా అక్కడి సిబ్బంది ఎవరూ అతడ్ని గుర్తించకపోవడం గమనార్హం. ఈలోగా అతడి పేరు మార్చి, సియర్స్ వర్గాస్ జీసస్ శాంటోస్ ఇవాన్ అనే పేరుతో మరో పాస్‌పోర్ట్‌ను ఏజెంట్ ఏర్పాటుచేశాడు. కానీ, గౌరవ్ నకిలీ పాస్‌పోర్టు, పత్రాలతో బొలీవియాకు బదులుగా కొలంబియా వెళ్లాలని ప్లాన్ చేసి దొరికిపోయాడు. ఇమిగ్రేషన్ కౌంటర్ వద్దకువెళ్లగా అసలు విషయం బయటపడింది.
దీంతో అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకొని ఢిల్లీకి పంపారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత గౌరవ్‌ను అక్కడ భద్రతా సిబ్బంది.. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేసి, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, విమానాశ్రయంలోని భద్రతలో డొల్లతనాన్ని ఈ సంఘటన మరోసారి రుజువుచేసినట్టయ్యింది. వారం రోజుల పాటు తమ కళ్లముందే తిరుగుతున్నా ఎవరూ కనిపెట్టలేకపోవడం గమనార్హం. ఒకవేళ అతడు బొలీవియాకు వెళ్లుంటే ఈ విషయం బయటపడేది కాదు.