అదానీతో విద్యుత్ ఒప్పందంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సెకి నుంచి అదానీ ద్వారా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనే టీడీపీ నేత పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై ఈరోజు (బుధవారం ) ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ధమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు.గుజరాత్లో తయారైన విద్యుత్‌ను ఏపీకి తీసుకురావడానికి అదనంగా చార్జీలు పడుతున్నాయని ఆదినారాయణ రావు చెప్పారు.
కేవలం మానుఫ్యాక్చర్ అనే ఒక పదాన్ని చేర్చి అదానీకి సెకీ నుంచి విద్యుత్‌ను కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని, దీని వలన తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్న సమయంలో అధిక ధరకు యూనిట్ 2.49 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటని రావు ప్రశ్నించారు. గుజరాత్‌కు యూనిట్‌కు 1.89 పైసలకు దొరుకుతుందని సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారాయని అమెరికా కోర్ట్‌లో చార్జిషీట్ ఫైల్ అయిందని ధర్మాసనం దృష్టికి న్యాయవాది తీసుకొచ్చారు.పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని లాయర్ చెప్పారు. వెంటనే ధర్మాసనం స్పందిస్తూ.. ఈ అంశం తమ దృష్టిలో ఉందని పేర్కొంది. అయితే తమకు కౌంటర్ వేసేందుకు సమయం కావాలని, ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ కోరారు. దీంతో తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.