సంక్రాంతికి ప్రయాణాల జాతర మోగనుంది. ఈనెల 19వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో భారీగా ప్రయాణ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో ప్రయాణాలు జరిగే పరిస్థితి ఉండటంతో ఆర్టీసీ ముందస్తు సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది 1,100 ప్రత్యేక బస్సులు తిప్పాలనుకుని, 1,310 బస్సులు తిప్పారు. ఈసారి మరిన్ని సెలవులను దృష్టిలో ఉంచుకుని 1,500 ప్రత్యేక బస్సులు నడపడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. రెండు రోజుల్లో అధికారికంగా ప్రత్యేక బస్సుల వివరాలను ప్రకటించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసమే సగం బస్సులను రిజర్వు చేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది బస్సులు చాలకపోవటంతో కార్లు, సొంత వాహనాల్లో అనేకమంది తరలివచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌కు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాలని భావిస్తున్నారు. మూడొంతులకు పైగా బస్సులను హైదరాబాద్‌కు పంపించాలనే ఆలోచన చేస్తున్నారు.