టెక్నాలజీ రంగంలో భారత్ దూసుకుపోతోంది. ఇందులో భాగంగా దేశీయ దిగ్గజ సంస్థలు తమ వంతుగా పలు రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. మరోపైపు, ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను నిర్మించే దిశగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అడుగులు వేస్తున్నారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఈ భారీ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నారు. దీని కోసం అధునాతన ఏఐ చిప్ లను రిలయన్స్ కొనుగోలు చేయనుంది. ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్స్ సామర్థ్యంతో ఏర్పాటు కావచ్చని భావిస్తున్నారు. మన దేశంలో ఏఐ కంప్యూటింగ్ మౌలిక వసతులతో పాటు ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుపై గత ఏడాది అక్టోబర్ లో రిలయన్స్, ఎన్విడియా చర్చలు జరిపాయి. ఆ సందర్భంగా ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ... భారత్ లో ప్రతి ఒక్కరికీ ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు.