తిరుమలలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులను శుక్రవారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన శ్రీవారి సేవ భవన సముదాయాలు, నారాయణగిరి ఉద్యానవనాలు, శ్రీవారి పుష్కరిణి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు.
అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్ద మీడియాతో మాట్లాడుతూ నారాయణగిరి ఉద్యానవనాల్లో టైంస్లాట్ సర్వదర్శనం భక్తులు వేచి ఉండేందుకు వీలుగా, ఎండకు, వానకు, చలికి ఇబ్బందులు పడకుండా రూ.23 కోట్లతో చేపడుతున్న శాశ్వత కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించామన్నారు. అక్కడ అన్నప్రసాదాలు, మరుగుదొడ్ల వసతి కల్పిస్తామన్నారు. శ్రీవారి పుష్కరిణి వద్ద ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు రూ.4.50 కోట్లతో పనులు ప్రారంభించినట్టు తెలిపారు. అదేవిధంగా మాడ వీధుల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. సప్తద్వారాల అంశానికి సంబంధించి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లోని ఆర్చిలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద గల సిమెంట్ కాంక్రీట్ ఆర్చిలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. తిరుమలలో పచ్చదనం పెంపు కోసం అటవీ, ఉద్యానవన విభాగాల ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టిన మొక్కల పెంపకం పనులను త్వరలో పరిశీలిస్తామన్నారు.
ఇటీవల జరిగిన ఆగమ సలహా మండలి సమావేశంలో రథమండపం నిర్మించాలని తీర్మానం జరిగిందని, రూ.1.50 కోట్లతో ఈ పనులు చేపడతామని ఈవో తెలిపారు. శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 24 నుండి 27వ తేదీ వరకు మహాసంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో 2018, ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు జరిగిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘట్టాన్ని గ్రంథస్తం చేయనున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa