భార్య రీల్స్ సరదాకు భర్త కానిస్టేబుల్ ఉద్యోగం ఊడిన ఘటన చండీగఢ్‌లో చోటు చేసుకుంది. చండీగఢ్‌లోని సెక్టార్-20 గురుద్వారా చౌక్ వద్ద జీబ్రా క్రాసింగ్‌పై జ్యోతి అనే మహిళకు సంబంధించిన రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ప్రజా భద్రతకు ముప్పు వంటి నేరాల కింద ఆమెపై కేసు నమోదైంది. అలాగే జ్యోతి భర్త అయిన అజయ్ కుందు అనే సీనియర్ కానిస్టేబుల్‌ను చండీగఢ్ పోలీసులు సస్పెండ్ చేశారు. దీనికి కారణం ఆ వీడియో అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్టు కావడమే. మార్చి 20న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి వివాదానికి దారితీసింది. సెక్టార్-32లోని ఒక ఆలయాన్ని సందర్శించిన తర్వాత జ్యోతి తన వదిన పూజ సహాయంతో డ్యాన్స్ రీల్‌ను చిత్రీకరించింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో జ్యోతి ట్రాఫిక్ జామ్‌ను పట్టించుకోకుండా ఒక పంజాబీ పాటకు నృత్యం చేయడం కనిపించింది.ఈ వీడియో వైరల్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్-34 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్-20లోని గురుద్వారా చౌక్, సెక్టార్-17లోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షించింది. వాటి ఆధారంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద జ్యోతి, పూజలపై బీఎన్ఎస్ సెక్షన్లు 125, 292, 3(5) కింద కేసు నమోదు చేశారు.సెక్టార్-19 పోలీస్ స్టేషన్‌లో సీనియర్ కానిస్టేబుల్‌గా పనిచేసే అజయ్ కుందు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆ వీడియోను అప్‌లోడ్ చేయడంతో అతడిని కూడా సస్పెండ్ చేశారు. అయితే, జ్యోతి, పూజలకు వెంటనే బెయిల్ మంజూరైంది.
![]() |
![]() |