బెంగళూరులో ఒకప్పుడు ఉద్యోగులకు, విద్యార్థులకు ఆశ్రయం ఇచ్చిన పేయింగ్ గెస్ట్ (PG) వసతులు.. ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోవడం, ప్రభుత్వం కొత్త, కఠినమైన నిబంధనలు తేవడం, కరెంటు-నీటి బిల్లులు పెరిగిపోవడంతో నగరంలో చాలా పీజీలు మూతపడుతున్నాయి. దీంతో పీజీ యజమానులు ఆందోళన చెందుతున్నారు, చాలా గదులు ఖాళీగా ఉంటున్నాయి. కరోనా వల్ల వచ్చిన నష్టాల నుంచి కోలుకుంటున్న పీజీ యజమానులు.. మళ్లీ మామూలు స్థితికి వస్తామని ఆశించారు. కానీ, ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు పోవడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలిక తీసుకొచ్చిన కొత్త, కఠినమైన నిబంధనలు కూడా వారికి పెద్ద సమస్యగా మారాయి.
పరిశ్రమ నిపుణుల ప్రకారం, ప్రస్తుతం సగటున పీజీలకు 25 శాతం నష్టాలు వస్తున్నాయి. దీనివల్ల చాలా మంది పీజీ యజమానులు తమ వ్యాపారాలను పూర్తిగా మూసివేస్తున్నారు. మారతహళ్లి, సర్జాపూర్ వంటి ఐటీ ప్రాంతాల్లో ఒకప్పుడు సందడిగా ఉన్న పీజీలు ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ డీటీ.. మాట్లాడుతూ, "ఒకటి కంటే ఎక్కువ బ్రాంచ్‌లు ఉన్న పీజీలు మాత్రమే నిలబడగలుగుతున్నాయి.
చిన్న పీజీలు చాలా వేగంగా మూతపడుతున్నాయి" అని తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం బాగా నడిచిన పీజీలు ఇప్పుడు తాళాలు వేసి, పాడుబడ్డ భవనాల్లా మారాయి. ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టెకీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కఠిన నిబంధనలు.. పీజీలకు కొత్త సమస్యలు
ఆగస్టు 2024లో ఒక పీజీలో హత్య జరిగిన తర్వాత, అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. BBMP, పోలీసులు మహదేవపురంలోనే దాదాపు 100 పీజీలకు సీల్ వేశారు. చాలా పీజీలకు సరైన ట్రేడ్ లైసెన్స్‌లు లేవు, లేదా భద్రత, పరిశుభ్రత నిబంధనలు పాటించడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా 40 అడుగుల కంటే తక్కువ వెడల్పు ఉన్న రోడ్లపై పీజీలు నడపకూడదనే నిబంధన కూడా దీనికి కారణమైంది. బెంగళూరులోని ఇరుకైన సందుల్లో ఉన్న అనేక పీజీలకు ఇది పెద్ద సమస్యగా మారింది.
ఖర్చులు పెరిగాయి.. దిక్కుతోచని స్థితిలో..
కరెంటు, నీటి బిల్లులు భారీగా పెరిగాయి. పీజీ యజమానులు ఇప్పటికే తక్కువ ఆక్యుపెన్సీతో నష్టపోతున్నారు. ఈ పెరిగిన ఖర్చుల్ని అద్దెలు పెంచకుండా భరించలేకపోతున్నారు. కానీ చాలా మంది పీజీ యజమానులు.. ఈ భారాన్ని విద్యార్థులు, ఉద్యోగులపై మోపడానికి ఇష్టపడటం లేదు. "ముఖ్యంగా విద్యార్థులకు అద్దెలు అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం" అని బెంగళూరు పీజీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సుఖి సియో చెప్పారు. "కానీ పెరుగుతున్న ఖర్చులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. చాలా మంది యజమానులు.. పీజీలను నడపడానికే కష్టపడుతున్నారు.'' అని అన్నారు.
పీజీల యజమానుల ఒత్తిడి, పరిశ్రమలో భారీగా వ్యాపారాలు మూతపడుతుండటంతో, BBMP కొన్ని కఠినమైన నిబంధనలను సడలించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వివాదాస్పదమైన 40 అడుగుల రోడ్డు-వెడల్పు ప్రమాణాన్ని సడలించడం వంటివి చర్చల్లో ఉన్నాయి. ఇది ఆమోదం పొందితే.. పీజీ రంగానికి తిరిగి జీవం పోయొచ్చు. రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసినప్పటికీ, బీబీఎంపీ ఇప్పటివరకు కేవలం 2500 పీజీలను మాత్రమే అధికారికంగా నమోదు చేయగలిగింది. దీనికి కారణం చాలా పీజీలు ప్రస్తుత కఠిన నిబంధనలను పాటించలేకపోవడమే.
బెంగళూరు పీజీలు.. వేలాది మంది యువతకు ముఖ్యంగా కొత్త గ్రాడ్యుయేట్లు, స్టార్టప్ ఉద్యోగులు, సిలికాన్ వ్యాలీలో అవకాశాలను వెతుకుతున్న టెక్ నిపుణులకు.. నగరంలో మొదటి నివాసంగా ఉండేవి. ఇప్పుడు, ఉద్యోగాలు పోవడం, ఇతర నిబంధనలతో.. పీజీలను మూసివేయడంతో, చాలా మంది సరసమైన ఇళ్లను కనిపెట్టడంలో కష్టపడుతున్నారు. నగరంలో అద్దెలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa