భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ ఆకస్మిక నిర్ణయానికి కేవలం పది రోజుల ముందు ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. "సరైన సమయం వచ్చినప్పుడు, దైవ సంకల్పం ఉంటే నేను పదవీ విరమణ చేస్తాను" అని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన రాజీనామా వెనుక ఉన్న రహస్యంపై అనేక సందేహాలను, ఊహాగానాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవి రాజ్యాంగ బద్ధమైన, అత్యంత గౌరవనీయమైన బాధ్యత. ఐదేళ్ల కాల పరిమితితో ఉండే ఈ పదవికి మధ్యంతరంగా రాజీనామా చేయడం చాలా అరుదు. అలాంటిది ఆరోగ్య కారణాలను చూపుతూ ధన్ఖడ్ రాజీనామా చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఆయన పదవిని వీడటానికి పది రోజుల ముందుగానే అంటే జులై 10వ తేదీన జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో దన్ఖడ్ ప్రసంగిస్తూ.. తాను 2027 ఆగస్టు నెలలో సరైన సమయంలో దైవ నిర్ణయానికి లోబడి పదవీ విరమణ చేస్తానని చెప్పారు. ఇది జరిగి కేవలం 10 రోజులు మాత్రమే కావొస్తుండగా.. అనారోగ్య కారణాల వల్ల తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను కూడా అందజేశారు. వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ)కు అనుగుణంగా ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ సమయంలోనే 10 రోజులు క్రితం ఈయన రాజీనామాపై చేసిన కామెంట్లు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ.. 'సరైన సమయం' అంటే ఏమిటి? 'దైవిక సంకల్పం' వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ముఖ్యంగా ఇది రాజకీయ ఒత్తిళ్లకు సూచనా? లేక అంతర్గత విభేదాల పర్యవసానమా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దన్ఖడ్ రాజీనామా భారత రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా పరిగణించబడుతోంది. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఈ రాజీనామా వెనుక ఉన్న పూర్తి వివరాలు భవిష్యత్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఆకస్మిక నిష్క్రమణకు సంబంధించిన పూర్తి నిజాలు ఎప్పుడు బయటపడతాయో వేచి చూడాలి.
మరోవైపు దన్ఖడ్ గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయనకు అనేక సార్లు విభేదాలు తలెత్తాయి. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కూడా రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన వ్యవహార శైలిపై ప్రతిపక్షాలు తరచుగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్లు, బిల్లుల ఆమోదం వంటి విషయాల్లో ఆయన నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. ఇలాంటి రాజకీయ వాతావరణంలో ఆయన రాజీనామా నిర్ణయం, కేవలం ఆరోగ్య కారణాలకే పరిమితమా అనే సందేహాలకు బలం చేకూరుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa