ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో జగన్​మోహన్ రెడ్డి పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2019, 10:03 AM

అమరావతి : నేటి నుంచి మూడ్రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకొని... అక్కడి నుంచి హెలికాప్టర్​లో 11 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె-పెద్దదండ్లూరుకు చేరుకుంటారు. "ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్" ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు.


ఈ పరిశ్రమ కోసం ఇప్పటికే 3వేల 148 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. దీన్ని రెవిన్యూ అధికారులు 4 రోజుల కిందటే ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్​కు అప్పగించారు. వారం కిందటే ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఇనుప ఖనిజం తరలించారు. రెండ్రోజుల కిందటే గండికోట జలాశయం నుంచి పరిశ్రమకు అవసరమైన నీటిని కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.విభజన తర్వాత కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచినా... కేంద్రం పట్టించుకోలేదు.జిల్లా వాసుల కల నెరవేర్చేందుకు 2018 డిసెంబర్‌ 27న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జమ్మలమడుగు నియోజకవర్గం లోని ఎం.కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇది మరుగున పడింది.


 


గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బ్రహ్మణీ స్టీల్స్‌కు-2007 జూన్ 10న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. చిటిమిటిచింతల వద్ద శంకుస్థాపన చేశారు. 2009లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత అదీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మూడోసారి జమ్మలమడుగు ప్రాంతంలోనే ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.శంకుస్థాపన తర్వాత సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్​ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్ పర్యవేక్షించారు. మధ్యాహ్నం కందూ నదిపై నిర్మించే మూడు ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. మైదుకూరు-బద్వేలు నియోజకవర్గాల్లోని జొలదరాశి జలాశయం, రాజోలి రిజర్వాయర్, కుందూ-తెలుగుగంగ కాల్వ ఎత్తిపోతల పథకాలకు నేలటూరు వద్ద శంకుస్థాపన చేస్తారు.


అనంతరం కడపకు చేరుకొని రిమ్స్‌లో 107 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే క్యాన్సర్ కేర్ సెంటర్​కు శంకుస్థాపన చేస్తారు. 175 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ భవనానికి శ్రీకారం చుడతారు.రాయచోటిలో 340 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ, వాటర్ పైపులైను, పట్టణ సుందరీకరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే 83 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.మంగళవారం ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటిస్తారు


 


వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడే చర్చిలో ప్రార్థనలు చేస్తారు. తర్వాత రాయచోటిలో అభివృద్ధి పనులు, ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందులకు చేరుకుంటారు. 25న అక్కడే సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa