తన దేశ నాయకత్వం కపటత్వాన్ని పాకిస్థాన్ చట్టసభ సభ్యుడూ తూర్పారబట్టారు. కాబూల్‌పై ఇస్లామాబాద్ సైనిక చర్యలను భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'తో పోల్చారు. అఫ్గనిస్థాన్‌లో అసిమ్ మునీర్ నాయకత్వంలోని పాకిస్థాన్ ఆర్మీ దాడులను జమియాత్ ఉలేమియా ఇస్లాం- ఎఫ్ చీప్ మౌలానా ఫజులూర్ రెహ్మాన్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడులు సమర్థనీయమని భావిస్తే ఉగ్రవాదులను నిర్మూలించడానికి పాక్ భూభాగంలోకి భారత్ ప్రవేశించినప్పుడు ఆ దేశానికి అభ్యంతరం చెప్పడానికి ఎటువంటి కారణం లేదని రెహ్మాన్ వ్యాఖ్యానించారు.
సోమవారం కరాచీలోని లియారీలో జరిగిన మజ్లిస్ ఇ ఇత్తేహాద్ ఇ ఉమ్మత్ సదస్సులో ఫజులూర్ రెహ్మాన్ పాల్గొని ప్రసంగించారు. రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్' చిత్రానికి వేదికగా నిలవడంతో ఈ పట్టణం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో లియారీ అండర్‌వరల్డ్, ఐఎస్ఐల మధ్య సంబంధాలను చిత్రీకరించారు.
‘మనం అఫ్గనిస్థాన్‌లో మన శత్రువుపై దాడి చేశామని చెప్పి, దానిని సమర్థిస్తే.. అప్పుడు బహావల్పూర్, మురిద్కే, కశ్మీర్‌లోని దాడికి బాధ్యత వహించిన గ్రూపుల ప్రధాన కార్యాలయాలపై దాడి చేశామని చెప్పి భారతదేశం కూడా సమర్థించుకోగలదు..’ అని ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావించారు. ‘మీరు ఎలా అభ్యంతరాలు లేవనెత్తగలరు? ఇప్పుడు అఫ్గనిస్థాన్ కూడా పాకిస్థాన్‌పై అవే ఆరోపణలు చేస్తోంది. ఈ ద్వంద్వ వైఖరిని మీరు ఎలా సమర్థించుకుంటారు?’ అని ఫజులూర్ రెహ్మాన్ ప్రశ్నించారు. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
పహల్గామ్లో 26 మంది అమాయకులను చంపిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోడానికి మే 7న భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్లకు చెందిన ప్రధాన స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనిక ఘర్షణకు దిగి, భారత్‌పైకి డ్రోన్లు, ఇతర ఆయుధాలను ప్రయోగించగా... ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పికొట్టింది.
ఇదిలా ఉండగా, అఫ్గన్ విషయంలో పాకిస్థాన్ వైఖరిని ఫజులూర్ రెహ్మాన్ తరుచూ విమర్శిస్తున్నారు. ఈ అక్టోబరులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఘర్షణలను తగ్గించుకునేలా మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చారు. ‘గతంలో తాను పాక్, అఫ్గన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో కీలకంగా వ్యవహరించాను... ఇప్పుడు కూడా అలా చేయగలను’ అన్నట్టు డాన్ పత్రిక నివేదించింది. రెహ్మాన్ ఈ ప్రాంతంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు గుర్తింపు పొందారు. తాలిబాన్ సుప్రీం నేత హైబతుల్లా అఖుంద్జాదాను కలిసిన ఏకైక పాక్ చట్టసభ సభ్యుడు ఈయనే కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa