సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కోడి పందాలు. బంధువుల రాకపోకలతో గ్రామాలు, నగరాలు కలకలలాడుతాయి. ఎక్కడ చూసినా పండగ వాతావరణం సందడి చేస్తుంది. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల సంబరాలు ఒకటేంటి మొత్తం హంగామా ఉంటుంది. పండగ అంటే ఇదే అనిపించేలా సందడి కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. వీటికి మించి అన్నట్టు పోటా పోటీగా కోడి పందాలు జరుగుతాయి. పండగకు కొద్ది నెలల ముందు నుంచే కోడి పందాలకు సన్నద్ధం అవుతుంటారు. కోడి పందాలకు లక్షల్లో ఖర్చు ఉంటుంది.
గోదావరి జిల్లాలంటే కోడి పందేలు. భీమవరం, మెట్ట ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. పెద్ద ఎత్తున పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందేలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి ఎన్నారైలు గోదావరి జిల్లాలకు తరలివస్తున్నారు. కొందరు పందాలలో డబ్బు సంపాదించాలని కోరుకుంటారు, కొందరు, తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు. ఈ ఏడాది కూడా భీమవరం, పాలకొల్లు, నరసాపురం, గణపవరం, వీరవాసరం, కోడి పందాల నియోజకవర్గాల్లో కూడా జోరుగా కోడిపందాలు నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఎలాగైనా పందెం కొట్టాలనే లక్ష్యంతో సరైన పుంజును బరిలోకి దింపేందుకు పందెంరాయుళ్లు వాటి శిక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. పుంజును పోటీలకు
సిద్ధం చేసేందుకు దాదాపు ఏడాది ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పందెం కోళ్ల శిక్షణ, పోషణకు యజమానులు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ముందుగా వాటి గొంతులో నీటిని పోసి, కపం పోయేలా కళ్లి కొట్టడం, నోట్లో నీరు పోసి ఊదడం, ఒంట్లో కొవ్వు కరిగించేందుకు పొయ్యిపై అట్లపెనం పెట్టి, దానిపై నీరు చల్లి, ఆ నీటిని గుడ్డతో కోడి శరీరానికి రాయడం వంటివి చేస్తారు. కత్తిపోట్లు తట్టుకోవడానికి, ఒళ్లు గట్టిపడడానికి పసుపు, పిప్పళ్లు, వట్టివేర్లు, ఉక్కిసాయిలం, జామాయిల్ సీస, కుంకుళ్లు తదితర 20 రకాల ఆకులతో మరగబెట్టిన నీటిని పోత పోస్తున్నారు. నీటిలో ఈదించడం, వాకింగ్ చేయించడం వంటివి చేస్తారు. పుంజు బరిలో దిగినప్పుడు ఆవేశ పడకుండా ఢీకొట్టేందుకు ఈత కొట్టిస్తామని యజమానులు చెబుతున్నారు.
జిల్లాలో ఏటా సంక్రాంతికి పందెం పుంజుల అమ్మకాలపై సుమారు రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. పుంజు ధర సుమారు రూ.15 వేల నుంచి సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. నెమలి, కాకి నెమలి, పచ్చకాకి, సేతువ, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగి, మైలా, ఫింగలా, పెట్టమర్రు తదితర రకాల పుంజులు ఉన్నాయి. గత మూడేళ్లుగా పెరూవియన్ జాతిని అభివృద్ధి చేస్తున్నారు. పెరూ దేశానికి చెందిన ఈ జాతి పుంజులు అమిత వేగంతో దెబ్బలాడతాయి. అవి చిన్నగా ఉండటం వల్ల స్వదేశీ కోళ్లతో సంకరం చేసి, వాటి ద్వారా వచ్చిన సెకండ్, థర్డ్ జనరేషన్ బ్రీడ్‌లను ప్రస్తుతం పందాలకు సిద్ధం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa