కర్నాటకలో హిజాబ్ వ్యవహారం దుమారం రేపుతోంది. మార్చి 17న(గురువారం) రాష్ట్ర బంద్‌కు కర్నాటక ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరాయి. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదని కర్నాటక హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. విద్యా సంస్థల్లో మతపరమైన దుస్తులు కాకుండా యూనిఫాం ధరించాలని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. దాన్ని సవాలు చేస్తూ ముస్లిం పెద్దలు దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కొందరు మంగళవారమే సుప్రీంకోర్టులో ముస్లిం సంఘాలు పిటిషన్లు వేశాయి. అయితే వాటిని హోలీ తర్వాత విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ తరుణంలో కర్నాటక బంద్‌కు ముస్లిం సంఘాలు పిలుపునివ్వడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.