మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నారు. తాజాగా అన్ని జిల్లాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ బుధవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 670 మండలాల్లో బుధవారం 43 మండలాల్లో వడగాల్పులు వీచాయని పేర్కొంది. మూడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయని వెల్లడించింది. ఆ మూడు మండలాలు విశాఖ జిల్లాలోనే ఉన్నాయని తెలిపింది. ఇక రానున్న 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 13 మండలాల్లో తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది. గురువారం విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.