తాడిపత్రి పట్టణంలోని పురాతన శ్రీచింతల వేంకటరమణస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీమహాలక్ష్మీదేవి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మురళీజయ్యంగారు సుప్రభాతసేవ, అభిషేకం, వివిధ రకాల వృష్పాలతో అమ్మవారికి అలంకరణ, నక్షత్రహారతి, అర్చనలు, తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తరుపున శ్రీచింతల వేంకటరమణస్వామికి, శ్రీ ఆనందవల్లి అమ్మవార్లకు కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలను ఆలయ కమిటీ చైర్మన్ బాణ నాగేశ్వర్ రెడ్డి దంపతులు, కమిటీ సభ్యులు ఆలయ అర్చకులకు అందచేశారు.
అనంతరం అర్చకులు శ్రీవారికి, శ్రీఆనందవల్లి అమ్మవారికి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి ఒడిబియ్యం సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
సాయంత్రం విశేష తిరువారాధన, దీపాలంకరణసేవ, వేదపారాయణం నిర్వహించారు. అమ్మవారిని గాజులతో అలంకరణ చేశారు. అమ్మవారికి అలంకరించిన గాజులను ఉగాది పండుగ రోజు భక్తులకు ఉచితంగా అందచేయనున్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీచింతల వేంకటరమణస్వామి ఆలయ కమిటీ చైర్మన్ బాణ నాగేశ్వర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నాగిశెట్టి సంజన్న, భూమా సార్, కనకాద్రి లక్ష్మీదేవి, మద్యాల లత, మల్లెల నారాయణమ్మ, సందేపాకుల లక్ష్మీనారాయణమ్మ, రామాంజినేయులు, రంగయ్య, శ్రీబుగ్గరామలింగేశ్వం స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పోలిశెట్టి ఆంజనేయులు, కమిటీ సభ్యులు అంబటి రాఘవేంద్రారెడ్డి, హరిప్రసాద్, రమేష్, భగీరథమ్మ, లక్ష్మీదేవి, అంకాల్, తదితరులు పాల్గొన్నారు.