ప్రపంచ వ్యాప్తంగా మే 1వ తేదీని 'మే డే'గా నిర్వహిస్తారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకునే ఈ రోజును చాలా దేశాల్లో సెలవుదినంగా ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ దినోత్సవం వెనుక హక్కుల కోసం పోరాటాలతో కూడిన ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. మే 1, 1886లో అమెరికాలోని షికాగోలోని హే మార్కెట్‌లో 8 గంటల పని విధానం కోసం తొలిసారి కార్మికులు పోరాడారు. ఈ పోరాటంలో ప్రదర్శనగా వెళ్లిన కార్మికులపై అక్కడి పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో కొందరు కార్మికులు ప్రాణాలు విడిచారు. అనంతరం 1889 నుంచి 1890 వరకు పలు దేశాల్లో కార్మిక ఉద్యమాలు సాగాయి. మే 1, 1890 సంవత్సరంలో బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో భారీగా కార్మికులు గుమిగూడారు. దాదాపు 3 లక్షల మంది కార్మికులు భారీ ప్రదర్శన చేపట్టారు. పని వేళలు రోజుకు 8 గంటలు మాత్రమే ఉండాలని నినదించారు.
బ్రిటన్‌లో కార్మికులు చేపట్టిన పని గంటల విధానంపై ఆందోళనలు క్రమంగా యూరప్ అంతటా పాకాయి. పలు దేశాల్లో పని వేళలను 8 గంటలకు కుదించాలని కార్మికులు నిరసనలు నిర్వహిస్తూ వచ్చారు. చివరికి కార్మికుల డిమాండ్ నెరవేరింది. వారి నిరసనలకు పరిశ్రమల యాజమాన్యాలు దిగొచ్చాయి. పని వేళలను 8 గంటలకు కుదించాయి. అయితే ఉద్యమానికి ఊపిరిలూదిన షికాగో కార్మికుల ప్రాణత్యాగానికి గుర్తుగా మే 1ని కార్మికుల దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.